Delhi Heavy Rains: యమునా నది ఉధృతి.. వాగుల్లా వీధులు, మడుగుల్లా మార్కెట్లు
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:54 PM
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు రాజధాని నగరం ఢిల్లీ విలవిల్లాడుతోంది. యమానా నది ప్రమాద స్థాయిని దాటి ప్రహహిస్తుండటంతో జనావాసాలు పలు చోట్ల నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వీధులు వాగులను, మార్కెట్ ప్రాంతాలు మడుగులను తలపిస్తున్నాయి. మంజూ కా తిలా నుంచి మదన్‌పూర్ ఖాదర్, బదర్‌పూర్‌లోని పలు కుటుంబాలు తాత్కాలిక శిబారాలలో తలదాచుకుంటున్నాయి.

యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది. దుకాణాలు ఖాళీ చేయడం, చేతికి అందిక వస్తువులతో నీటి నుంచి దుకాణదారులు బయటపడటం వంటివి కనిపించాయి. వరద నీరు తగ్గుముఖం పడితే కానీ ఏమేరకు నష్టం జరిగిందో అంచనా వేయలేమని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం 2023 తర్వాత ఇది రెండోసారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ ఏరియా నివాసి థాపా కోరారు. వరదనీటికి అతి సమీపంలో వేలాడుతున్న ఎలక్ట్రిక్ వైర్ల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందన్నారు.

మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతంలో తమ జుగ్గీలను కోల్పోయిన కుటుంబాలు రోడ్లపైన పాత ప్లాస్టిక్ షీట్ల కింద నివసిస్తున్నారు. తమ వస్తువులన్నీ లోపలే ఉన్నాయని, ఏవీ బయటకు తెచ్చుకోలేదని, ముఖ్యంగా మహిళలు టాయిలెట్ సౌకర్యం కూడా లేక ఇక్కట్లు పడుతున్నాయని ఆ ప్రాంతవాసి ఒకరు తెలిపారు. పెరుగుతున్న నీటిమట్టంతో వీధికుక్కలు సైతం పాడుబడిన ఇళ్ల మెట్లపై కనిపిస్తున్నాయి. కొందరు ఆహారం, వంటపాత్రలు లేక కేవలం బిస్కట్లు, రొట్టెలపై ఆధారపడుతుండగా, పలువురు రోడ్లపై ఏర్పాట్లు చేసుకున్న చిన్నచిన్న టెంట్లలో తలదాచుకుంటారు. కార్లు, మోటారుసైకిళ్లు నీటమునగగా, మరికొందరు తమ ఇళ్లు నీటమునిగిపోతున్నా నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. యమునా బజార్, బదర్‌పూర్‌లోనూ వరదనీటిలో పలు ఇళ్లు చిక్కుకున్నాయి. ఇంటి పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టీఆర్ఎఫ్‌కు నిధులు అందించినది వీరే
యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి
For More National News And Telugu News