Delhi Encounter: ఢిల్లీలోని రోహిణిలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు గోగి గ్యాంగ్ సభ్యుల అరెస్టు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:00 PM
పట్టుబడిన గోగి గ్యాంగ్ సభ్యులను లల్లూ, ఇర్పాన్‌గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా, నితీష్ అనే మరో సభ్యుడు కూడా పట్టుబడ్డాడు. ఇద్దరు ముఠా సభ్యులు సమీప ప్రాంతంలోకి పారిపోగా ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులకు, నటోరియస్ గోగి గ్యాంగ్ (Gogi gang) సభ్యులకు మధ్య శనివారంనాడు రోహిణిలోని బుద్ధ విహార్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులు కారులో ఆయుధాలతో వెళ్తుండగా వారిని అడ్డుకోవడంతో పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. కారును అక్కడే వదిలేసి పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీస్ టీమ్ ఎదురుకాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ముఠా సభ్యులు గాయపడ్డారు.
కాగా, పట్టుబడిన గోగి గ్యాంగ్ సభ్యులను లల్లూ, ఇర్పాన్‌గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా, నితీష్ అనే మరో సభ్యుడు కూడా పట్టుబడ్డాడు. ఇద్దరు ముఠా సభ్యులు సమీప ప్రాంతంలోకి పారిపోగా ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారి నుంచి అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
గోగి గ్యాంకుకు చెందిన క్రిమినల్ లల్లు, అతని సహచరులు గోరక్షక్ దళ్‌కు చెందిన ఒక వ్యక్తి నివాసం వద్ద కాల్పులు జరపనున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో పీఎస్ బుద్ధ విహార్‌కు చెందిన గస్తీ బృందం అప్రమత్తమైంది. సెక్టార్-24లోని బంకే బిహారి మందిరం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి కారును పెట్రోల్ టీమ్ అడ్డుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గోగి గ్యాంగ్‌కు బలవంతపు వసూళ్లు, బెదిరింపులు సహా పలు నేరపూరిత చర్యల్లో ప్రమేయం ఉంది. దీంతో ఆ ముఠా కార్యకలాపాలపై అధికారుల నిరంతర నిఘా కొనసాగుతోంది. నేరపూరిత ఘటనలను నిరోధించేందుకు రోహిణి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు గస్తీని ముమ్మరం చేసారు. కాగా, పట్టుబడిన నిందితులపై ఐపీసీ, ఆయుధాల చట్టం కింద కేసులో నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గోగి గ్యాంగ్ నెట్‌వర్క్ ఆటకట్టించేందుకు, పరారీలో ఉన్న క్రిమినల్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై యూఎస్ నిర్ణయంపై రాహుల్ విమర్శ
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..