Delhi Councillor Warning: 30 రోజుల్లో హిందీ నేర్చుకోలేదంటే.. ఢిల్లీలో ఆఫ్రికా జాతీయుడికి భీకర వార్నింగ్
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:01 PM
ఢిల్లీలో ఉంటున్న ఓ ఆఫ్రికన్ జాతీయుడిని నెల రోజుల్లోపు హిందీ నేర్చుకోవాలంటూ స్థానిక మహిళా కౌన్సిలర్ వార్నింగ్ ఇచ్చిన వైనం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నెల రోజుల్లోగా హిందీ నేర్చుకోవాలంటూ ఓ ఆఫ్రికా జాతీయుడికి ఢిల్లీలోని బీజేపీ మహిళా కౌన్సిలర్ వార్నింగ్ ఇచ్చిన వైనం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెట్టింట జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Delhi Councillor Warning African National Over Hindi Language).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కౌన్సిలర్ రేణు చౌదరి అక్కడి ఓ పబ్లిక్ పార్క్‌లో పిల్లలకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్న ఆఫ్రికా జాతీయుడికి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలంగా భారత్‌లో ఉంటూ ఇంకా హిందీ ఎందుకు నేర్చుకోలేదని ఆగ్రహంగా ప్రశ్నించారు. తన సూచనల్ని సీరియస్‌గా తీసుకోలేదని అన్నారు. వెంటనే వివరణ ఇవ్వాలని అన్నారు. ‘నెల రోజుల్లోపు హిందీ నేర్చుకోకుంటే వెంటనే పార్క్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకోండి’ అని పక్కనున్న వారికి తేల్చి చెప్పారు. నేరాలు జరిగే అవకాశం ఉండటంతో వారిపై ఓ కన్నేసి ఉంచాలని మిగతా వారికి చెప్పారు. అతడి వల్ల తప్పు జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని పక్కనున్న వారిని హెచ్చరించారు.
ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో సదరు మహిళా నేతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె తీరు అమర్యాదకరం, అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని కొందరు ఆక్షేపించారు. విదేశీ వ్యక్తులకు హిందీ తప్పనిసరి చేయడంలో హేతుబద్ధత లేదని కొందరు అన్నారు. చాలా కాలంగా సదరు వ్యక్తి స్థానికులకు కోచింగ్ ఇస్తుంటే ఇంకా ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. విదేశాల్లో పని చేస్తున్న భారతీయులను స్థానిక భాషలు నేర్చుకోవాలంటూ అక్కడి వారు ఇలా పట్టుబట్టరని గుర్తు చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఇవి కూడా చదవండి
భారత్ నుంచి పెరుగుతున్న శాశ్వత వలసలు.. ఏటా 2 లక్షల మందికి పైగా...
ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్స్.. క్షమాపణ చెప్పనన్న మహారాష్ట్ర మాజీ సీఎం