Asim Munir: ఆపరేషన్ సిందూర్‌లో మమ్మల్ని ఆదుకుంది అదే: పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:25 AM
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు. తాము ఆ అనుభూతిని చెందామని చెప్పుకొచ్చారు. పాక్ చిన్నారుల రక్తం చిందడానికి అఫ్గానిస్థాన్ కారణమని నిందించారు. పాక్ కావాలో, ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో తేల్చుకోవాలని తాలిబన్లకు తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గడగడలాడింది. చివరకు కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడుల సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని వ్యాఖ్యానించారు. ఆ అనుభూతి తమకు కలిగిందని కూడా చెప్పుకొచ్చారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన జాతీయ ఉలేమా కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ మునీర్ ఈ కామెంట్స్ చేశారు. తాజాగా వెలుగులో కొచ్చిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ‘ఆ దైవిక సాయాన్ని మేము అనుభూతి చెందాము’ అని ఆయన అన్నారు (Asim Munir - Divine Help).
ఈ సందర్భంగా తాలిబాన్ల గురించి కూడా మునీర్ ప్రస్తావించారు. వారికి పాకిస్థాన్ కావాలో లేక ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు. సరిహద్దు మీదుగా చొరబడుతున్న ఉగ్రవాదులు అందరూ అఫ్గాన్ జాతీయులేనని అన్నారు. ‘టీటీపీ దళాల్లో చేరుతున్న వారిలో 70 శాతం మంది అఫ్గానీలే. మరి పాకిస్థానీ చిన్నారుల రక్తాన్నీ అఫ్గానీలు కళ్ల చూస్తున్నట్టే కదా’ అని అన్నారు. కాబట్టి పాక్ కావాలో టీటీపీ కావాలో అఫ్గానిస్థాన్ తేల్చుకోవాలని అన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత్ భీకర దాడులు చేసి కోలుకోలేని దెబ్బకొట్టింది. చివరకు బెంబేలెత్తిన పాక్ భారత్ ముందు కాల్పుల విరమణ ప్రతిపాదనను తెచ్చింది. అయితే, భారత్, పాక్ మధ్య రాజీ కుదిర్చింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. పాక్ కూడా ట్రంప్ మాటనే వల్లెవేసింది. అయితే, ఈ వివాదంలో ఇతరుల జోక్యం లేదని భారత్ స్పష్టం చేసింది. పాక్ ముందుగా శాంతి ప్రతిపాదన తెచ్చిందని పేర్కొంది.
ఇవీ చదవండి:
వీసా ఫీజు పెంపు.. కాలిఫోర్నియాలో బెంబేలెత్తిస్తున్న టీచర్ల కొరత
విమర్శలకు వెనక్కుతగ్గిన అమెరికా న్యాయశాఖ.. ట్రంప్ ఫొటోల పునరుద్ధరణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి