Operation Sindoor : బలమైన సందేశం
ABN , Publish Date - May 08 , 2025 | 01:55 AM
భారతదేశం తలపెట్టి, ముప్పావు గంటలోనే ముగించిన, సైనిక చర్య ఆపరేషన్ సిందూర్ అభినందనీయం. రెండు వారాల క్రితం కాశ్మీరులోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై దాడికి తెగబడ్డ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మూలాల్ని...
భారతదేశం తలపెట్టి, ముప్పావు గంటలోనే ముగించిన, సైనిక చర్య ఆపరేషన్ సిందూర్ అభినందనీయం. రెండు వారాల క్రితం కాశ్మీరులోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై దాడికి తెగబడ్డ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మూలాల్ని అంతం చేసే తలంపుతో తలపెట్టిన ఈ సైనిక చర్య భారత్ శక్తియుక్తులను తెలిపేది. తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు తాజా హెచ్చరిక లాంటిది.
భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్‌కు కొత్త కాదు. 1947 నుంచి ఇప్పటికి నాలుగుసార్లు యుద్ధానికి తెగబడినా, లెక్కకు మిక్కిలిసార్లు భారత్ పైకి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పినా భారత్ సంయమనం కోల్పోలేదు. ఆయా యుద్ధాల్లో విజయం సాధించినా, పాకిస్థాన్‌ని కట్టడి చెయ్యడం వరకే పరిమితమైంది. అంతర్జాతీయ నియమాల్ని, నీతిని తప్పి ప్రవర్తించలేదు. పహల్గాంలో జరిగిన దాడి మామూలుది కాదు. కాశ్మీరులో సాధారణ స్థితి నెలకొన్న వేళ, పర్యాటకులపై విరుచుకుపడి 26 మంది ప్రాణాలు తీయడం, అప్పటికప్పుడు జరిగిన ఉగ్రవాద చర్య మాత్రమే కాదు. దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడి. తద్వారా అటు స్థానిక, దేశీయ ఆర్థికంపై తక్షణ దాడి చెయ్యడమే కాకుండా, మారిన ప్రపంచ వాణిజ్య చిత్రం నేపథ్యంలో భారత్ వైపు చూస్తున్న పరిశ్రమలు రాకుండా చెయ్యడం, సురక్షితం కాదని నిరూపించి భారత్ ఎదుగుదలకి అడ్డం పడడం ఆ ఉగ్రవాదులకు, వెనుక నుంచి నడిపిస్తున్న పాకిస్థాన్‌కున్న ఏకైక వ్యూహం. అందుకే ఈసారి భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
1971 తర్వాత తొలిసారిగా మూడు సైనిక దళాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్ ఇది. పాకిస్థాన్‌లో, పాక్ ఆక్రమిత కాశ్మీరులో తొమ్మిది చోట్ల ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి గంటలోపే పదుల సంఖ్యలో ఆ ముష్కరుల్ని మట్టుబెట్టాయి. వారి స్థావరాలను, పరికరాలని ధ్వంసం చేసి విజయవంతంగా తిరిగి వచ్చాయి. టార్గెట్ చేధించడం, పౌరులకు నష్టం కలిగించక పోవడం భారత్ నీతికి, సామర్థ్యానికి నిదర్శనం. అందుకనే ప్రపంచ దేశాలు కూడా మద్దతుగా ఉన్నాయి. పాకిస్థాన్ సైనిక, పౌర పాలకులు ఇకనైనా తమ తీరు మార్చుకోకపోతే, మరింత తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్న హెచ్చరిక ఈ సైనిక చర్యలో ఉంది. ఆ సందేశం అర్థం చేసుకుని ఉగ్రవాదుల్ని వదులుకోవడమా, లేదా భారత్‌తో తలపడి సర్వనాశనాన్ని కొనితెచ్చుకోవడమా అన్నది ఆ దేశపు విజ్ఞతపై ఆధారపడి ఉంది.
డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన