Prithiviraj Chavan: ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్స్.. క్షమాపణ చెప్పనన్న మహారాష్ట్ర మాజీ సీఎం
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:34 PM
ఆపరేషన్ సిందూర్‌పై తన కామెంట్స్ దుమారం రేపుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. తను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌పై (Operation Sindoor) తను చేసిన కామెంట్స్‌తో దుమారం రేగుతుండటంపై మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. ఈ కామెంట్స్‌పై తాను క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు (Prithviraj Chavan Comments) .
పుణెలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చవాన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా తన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని తేల్చి చెప్పారు. దీంతో, బీజేపీ నేతలు ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా నేరుగా సీనియర్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. తన పార్టీ సభ్యుడి వ్యాఖ్యలను ఖండించకపోవడం రాహుల్ గాంధీ మైండ్ సెట్‌ను తెలియజేస్తోందని అన్నారు. సైన్యాన్ని అవమానించడం కాంగ్రెస్ పార్టీ తీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చవాన్‌తో పాటు రాహుల్ గాంధీ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. సైన్యాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇలాంటి వ్యా్ఖ్యలు చేసేవారికి దేశ ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ బ్రిజ్ లాల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ దేశం ఈ కామెంట్స్‌ను విన్నదని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
మరోవైపు, ఈ వివాదంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఈ కామెంట్స్‌పై ఝార్ఖండ్ నేత, లోక్‌సభ ఎంపీ సుఖ్‌దియో భగత్ స్పందించారు. ‘ఆయనకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనే చెప్పాలి. మాకు సైన్యం గర్వకారణం. ఉగ్రవాదం, పాక్‌పై పోరులో ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది’ అని అన్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాక్ ప్రయోగించిన అనేక డ్రోన్స్, మిసైళ్లను గగనతలంలోనే భారత్ ధ్వంసం చేసింది. పాక్‌కు చెందిన పలు యుద్ధ విమానాలను కూడా కూల్చేసింది.
ఇవి కూడా చదవండి
ఇకపై ఆ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్.. తప్పనిసరి చేసిన ప్రభుత్వం!
శీతాకాలంలో ఢిల్లీలో తప్పక సందర్శించాల్సిన టాప్ 5 ప్రదేశాలు