Share News

Jemimah Rodriguez: నాకు విజయాన్ని అందించే సూపర్ పవర్ అదే: జెమీమా

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:01 PM

ఉత్సాహవంతురాలిగా పేరు పొందిన జెమీమా ఈ లక్షణమే తన సూపర్ పవర్ అని అన్నారు. ఈ ఎనర్జీ ఎప్పుడు ఎలా వాడుకున్నామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

Jemimah Rodriguez: నాకు విజయాన్ని అందించే సూపర్ పవర్ అదే: జెమీమా
Jemimah Rodriguez

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళల జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ జెమీమా రోడ్రీగెజ్. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో 127 పరుగులతో జెమీమా అజేయంగా నిలిచారు. జట్టులో ఉత్సాహవంతురాలైన ప్లేయర్‌గా ఆమెకు పేరుంది. ఇదే లక్షణాన్ని తాను సూపర్ పవర్‌గా మార్చుకున్నానని తాజాగా జెమీమా చెప్పుకొచ్చారు (Jemimah Rodriguez).

‘నాలో మంచి ఉత్సాహం ఉంది. కానీ దీన్ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకున్నామనేదే ముఖ్యం. మా సర్ (హెడ్ కోచ్ అమోల్ మజుందార్) ఎప్పుడూ ఇదే చెబుతుంటారు. నాకు ఆ ఎనర్జీ ఉందని, టీమ్‌కు కూడా ఇది ఉపయోగపడుతుందని అంటారు. కానీ నేను గ్రౌండ్‌లో కాలుమోపాక మరో మనిషిగా మారిపోతానని టీమ్ మేట్స్ అంటుంటారు. చాలా సీరియస్‌గా, ఆటపై చెదరని ఏకాగ్రతతో కనిపిస్తానని అంటారు. బట్ నా తీరు అంతే.. ఒక్కసారి మైదానంలో అడుగు పెడితే ఇక మనసంతా ఆట మీదే ఉంటుంది’


‘ఆ ఎనర్జీని, ఉత్సాహాన్ని ఎలా బ్యాలెన్స్ చేశామనేదానిపై అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్సాహాన్ని ఎప్పుడు ఎలా ఆన్, ఆఫ్ చేయాలో తెలియడమే నా సూపర్ పవర్ అనుకుంటున్నాను’ అని అన్నారు.

టోర్నీకి ముందు ఒత్తిడి, అపనమ్మకం తనను వేధించాయని కూడా గతంలో ఓ సందర్భంలో జెమీమా అన్నారు. ‘టోర్నీ మొదట్లో చాలా ఆందోళన చెందాను. అమ్మకు ఫోన్ చేసేదాన్ని. ఒత్తిడిలో ఉన్నప్పుడు మెదడు అంతా స్తబ్దుగా మారిపోతుంది’ అని సెమీఫైనల్ తరువాత ఆమె చెప్పారు. అయితే, జెమీమాను ప్రత్యర్థులే ప్రశంసల్లో ముంచెత్తారు. ‘దక్షిణాఫ్రికాకు చెందిన ఐదుగురు ప్లేయర్స్ వచ్చి నన్ను ప్రశంసాపూర్వకంగా కౌగిలించుకున్నారు. నన్ను చూస్తే వారికి గర్వంగా అనిపించిందట. ప్లేయర్స్‌గా మేమందరం దాదాపు ఒకే భావోద్వేగాలకు గురవుతాము. కానీ వాటిని పంచుకోవాలంటే చాలా ధైర్యం కావాలి’ అని అన్నారు. వరల్డ్ కప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా జెమీమా నిలిచిన విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

టాస్ గెలిచిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్ ఎవరంటే?

ఇప్పుడు గిల్.. నెక్స్ట్ సూర్యకుమార్.?

Updated Date - Dec 21 , 2025 | 12:37 PM