Share News

Ultimatum To SKY: ఇప్పుడు గిల్.. నెక్స్ట్ సూర్యకుమార్.?

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:25 AM

టీ20 ప్రపంచ కప్‌నకు ఎంపిక చేసిన జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పించింది సెలక్షన్ కమిటీ. అతడి పేలవ ఫామే ఇందుకు కారణం. టీ20 మ్యాచ్‌ల్లో అదే తరహాలో కొద్ది కాలంగా విఫలమవుతున్న మరో ఆటగాడు సూర్యకుమార్. అయితే.. కెప్టెన్ కావడంతో ప్రస్తుతం అతడి స్థానానికి ఢోకా లేకపోయినా.. ఇదే చెత్త ప్రదర్శన ఇలాగే కొనసాగితే జట్టులో అతడి స్థానమూ ప్రశ్నార్థకం కానుంది.

Ultimatum To SKY: ఇప్పుడు గిల్.. నెక్స్ట్ సూర్యకుమార్.?

ఇంటర్నెట్ డెస్క్: 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup)నకు ఎంపికైన జట్టులో టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(Subhman Gill)పై వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌(T20 Captian Surya Kumar Yadav)కు ఇదో హెచ్చరికలా మారింది. సుమారు ఏడాది కాలం తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసిన గిల్.. పేలవ ఫామ్‌తో జట్టులో స్థానం కోల్పోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చి.. వరుసగా 4, 0, 28 పరుగలు చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఫలితంగా టీమ్ మేనేజ్‌మెంట్ అతణ్ని పక్కన పెట్టాల్సి వచ్చింది.


కెప్టెన్‌గా ఓకే.. కానీ...

ఇక, ఇటీవల పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(SKY). అయినప్పటికీ కెప్టె‌న్‌గా అతడికి మరో అవకాశం కల్పించారు సెలెక్టర్లు. అయితే.. వచ్చే ఏడాది ప్రపంచ కప్ అనంతరం సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ(BCCI) సన్నద్ధమైనట్టు సమాచారం. సారథిగా జట్టును నడిపించడంలో స్కై సక్సెస్ అయినప్పటికీ.. బ్యాటర్‌గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. టీ20 కెప్టెన్‌గా సూర్య బాధ్యతలు చేపట్టాక 35 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా 28 విజయాలు సాధించింది. 5 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడగా.. రెండింట్లో ఫలితం రాలేదు. ఇక ఆటగాడిగా.. గత 24 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించలేకపోయాడు సూర్య. ఈ ఏడాది 19 ఇన్నింగ్స్‌ల్లో 123.2 స్ట్రైక్ రేట్‌తో కేవలం 218 పరుగులు మాత్రమే చేయడం అతడి చెత్త ప్రదర్శనకు నిదర్శనం.


సారథ్య బాధ్యతలు సూర్య కుమార్‌ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతున్నట్టు బీసీసీఐ భావిస్తోంది. దీంతో అతడి స్థానంలో మరో ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి కెప్టెన్సీ నుంచి సూర్యను ముందే తొలగించాలని భావించినప్పటికీ.. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మెగా టోర్నీ ముందు తమ నిర్ణయాన్ని సెలక్టర్లు వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అయితే.. అతను ఫామ్ అందుకోకపోతే భవిష్యత్తులో ఆటగాడిగానూ కొనసాగే అవకాశాలు సన్నగిల్లినట్టే. ఇప్పుడు శుభ్‌మన్ విషయంలో జరిగినదే.. రానున్న కాలంలో స్కై విషయంలోనూ రిపీట్ కావచ్చు.


ఇవీ చదవండి:

T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..

నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్

Updated Date - Dec 21 , 2025 | 11:22 AM