Indian Citizenship: భారత్ నుంచి పెరుగుతున్న శాశ్వత వలసలు.. ఏటా 2 లక్షల మందికి పైగా...
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:31 AM
2022 మొదలు ఏటా రెండు లక్షల పైచిలుకు మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తాజా శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఈ వివరాలను లోక్‌సభలో వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులు అనేక మంది తమ పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాలకు తరలిపోతున్నారు. 2020 నుంచి ఇప్పటివరకూ దాదాపు 9 లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక 2022 మొదలు ఏటా రెండు లక్షల పైచిలుకు భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం పార్లమెంటుకు ఈ వివరాలను వెల్లడించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2011-24 మధ్య కాలంలో 2.06 మిలియన్‌ల భారతీయులు (20 లక్షల పైచిలుకు మంది) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వీరిలో దాదాపు సగం మంది గత ఐదేళ్లల్లో పౌరసత్వాన్ని వదులుకున్నారు. మొదట్లో ఏటా సగటున 1.2 లక్షల నుంచి 1.45 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకునే వారు. 2022 తరువాత ఈ సగటు 2 లక్షల మార్కును దాటినట్టు ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. వారు పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారనేది ఆయా వ్యక్తులకే తెలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. చాలా మంది వ్యక్తిగత కారణాలతో దేశాన్ని వీడి విదేశీ పౌరసత్వం పొందినట్టు తెలిపింది.
భారత్‌లో 1970ల నుంచి మేధో వలసలు ఎక్కువైన విషయం తెలిసిందే. ఆ తరువాత కాలం గడిచే కొద్దీ దేశాన్ని వీడుతున్న వారి సంఖ్య పెరిగింది. 2020ల్లో ఇది పతాకస్థాయికి చేరుకుంది. బ్రిటీష్ పాలనలో భారతీయులు వెట్టి చాకిరీ చేసేందుకు విదేశాలకు తరలిపోయారు. 1970ల తరువాత డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారు దేశాన్ని వీడటం మొదలెట్టారు. ప్రస్తుతం సంపన్నులు దేశాన్ని వీడుతున్నారని మన్మోహన్ సింగ్ హయాంలో మీడియా సలహాదారుగా సేవలందించిన సంజయ్ బారూ తన పుస్తకం ‘సెస్సెషన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్.. ద ఫ్లైట్ ఔట్ ఆఫ్ న్యూ ఇండియా’లో రాశారు.
భారతీయుల వలసలను నాలుగు దశలుగా ఆయన విభజించారు. ప్రస్తుతం నాలుగో దశ నడుస్తోందని, ఇందులో సంపన్నులతో పాటు సామాజిక, రాజకీయ ప్రముఖులు, వారి సంతానం దేశాన్ని వీడుతున్నారని తెలిపారు. భారత్‌లో ద్వంద్వ పౌరసత్వం లేకపోవడంతో అనేక మంది భారతీయులు తమ పాస్‌పోర్టును వదులుకుని విదేశీ పౌరసత్వం తీసుకోవాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతికి చెందిన అనేక మంది నిత్యం సోషల్ మీడియాలో ద్వంద్వ పౌరసత్వ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంటారు. ప్రస్తుత చట్టాల ప్రకారం, భారతీయులు విదేశీ పౌరసత్వం తీసుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా తమ భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.
ఇవి కూడా చదవండి
ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్స్.. క్షమాపణ చెప్పనన్న మహారాష్ట్ర మాజీ సీఎం
ఇకపై ఆ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్.. తప్పనిసరి చేసిన ప్రభుత్వం!