PM Modi: క్రిమినల్స్ జైళ్లలో ఉండాలి, అధికారంలో కాదు.. బెంగాల్ ర్యాలీలో మోదీ
ABN , Publish Date - Aug 22 , 2025 | 08:35 PM
పార్లమెంటులో ప్రతిపాదిత బిల్లును మోదీ సమర్ధిస్తూ, నేరచరిత్ర ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని, జైలు నుంచి ఆదేశాలు ఇవ్వడం కుదరదని అన్నారు.
కోల్‌కతా: తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంతులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే కొత్త బిల్లును తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ వ్యతిరేకించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. క్రిమినల్ మంత్రులు ఉండాల్సింది జైళ్లలోనే కానీ అధికారంలో కాదని అన్నారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎన్నుకోవడం ద్వారా మార్పు తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రూ.5,200 కోట్ల విలువైన మూడు కీలక మెట్రో మార్గాలతో సహా మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రధాని శుక్రవారనాడిక్కడ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో అధికార టీఎంసీపై నిప్పులు చెరిగారు.
'ఒక పీఎం కానీ సీఎం కానీ జైలు పాలయితే వారిని డిస్మిస్ చేసే లీగల్ ప్రొవిషన్ లేదు. నిస్సిగ్గుగా జైలులో ఉండి మరీ కొందరు అధికారం నడుపుతున్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఒక టీఎంసీ మంత్రి ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడానికి ఇష్టపడటం లేదు' అని మోదీ తప్పుపట్టారు. పార్లమెంటులో ప్రతిపాదిత బిల్లును మోదీ సమర్ధిస్తూ, నేరచరిత్ర ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని, జైలు నుంచి ఆదేశాలు ఇవ్వడం కుదరదని అన్నారు. కొన్ని పార్టీలు ప్రజల ఆకాంక్షలను, గౌరవం, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కేవలం ఓటు బ్యాంకుగానే వారిని పరిగణిస్తున్నారని తప్పుపట్టారు.
బెంగాల్ అభివృద్ధికి శత్రువు
మమతాబెనర్జీ సారథ్యంలోని టీఎంసీ బెంగాల్ అభివృద్ధికి శత్రువు, బీజేపీని ఎదగకుండా చేయడం ఒక్కటే ఆ పార్టీ లక్ష్యమని అన్నారు. బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని, నేరాలు, అవినీతికి ప్రభుత్వం ఒక చిరునామాగా మారిందని విమర్శించారు. టీఎంసీ అధికారంలో ఉన్నంత వరకూ అభివృద్ధి అనేది శూన్యమని, టీఎంసీని అధికారంలో నుంచి తొలగిస్తేనే నిజమైన మార్పు సాధ్యమని సూచించారు.
తిప్పికొట్టిన టీఎంసీ
కాగా, అవినీతిపై పీఎం చేస్తున్న వాదనను పశ్చిమబెంగాల్‌లోని అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. 2016 నారద స్టింగ్ ఫుటేజ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి డబ్బులు తీసుకుంటూ కెమేరాకు చిక్కిన విషయాన్ని గుర్తు చేసింది. 'గ్లాస్ హౌస్‌లో కూర్చుని ఆయన శాపాలు పెడుతున్నారు. దొంగతనంలో పాలుపంచుకున్న వ్యక్తిని (సువేందు అధికారి) పక్కనే ఉంచుకుని వేదకమీద నుంచే బెంగాల్‌ను అవమానిస్తున్నారు' అని టీఎసీ ఎంపీ కునాల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
For More National News And Telugu News