Tamilnadu Assembly Elections: స్టాలిన్‌ను కలిసిన కాంగ్రెస్ కమిటీ.. డీఎంకేతో సీట్ల పంపకాల చర్చలు షురూ
ABN , Publish Date - Dec 03 , 2025 | 09:36 PM
సమావేశానంతరం సెల్వపెరుంతగై మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని గిరీష్ కలవడంతో అన్ని ఊహాగానాలకు తెరపడినట్టేనని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య పటిష్టమైన పొత్తు ఉందని, కలిసికట్టుగా గతంలో ఐదు ఎన్నికలు గెలిచామని చెప్పారు. తమది 'విన్నింగ్ అలయెన్స్' అని అభివర్ణించారు.
చెన్నై: వచ్చే ఏడాది తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలను కాంగ్రెస్ ప్రారంభించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కాంగ్రెస్ కమిటీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), డీఎంకే సీనియర్ నేతలను బుధవారంనాడు కలిసింది. ఈ కమిటీలో ఏఐసీసీ తమిళనాడు, పుదుచ్చేరి ఇన్‌చార్జి గిరీశ్ రాయ చోడంకర్, రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై, అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజేష్ కుమార్, నివేదిత ఆల్వా, సూరజ్ హెగ్డే ఉన్నారు.
సమావేశానంతరం సెల్వపెరుంతగై మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని గిరీష్ కలవడంతో అన్ని ఊహాగానాలకు తెరపడినట్టేనని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య పటిష్టమైన పొత్తు ఉందని, కలిసికట్టుగా గతంలో ఐదు ఎన్నికలు గెలిచామని చెప్పారు. తమది 'విన్నింగ్ అలయెన్స్' అని అభివర్ణించారు.
కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి తెచ్చిన ఒక సీల్డ్ కవర్‌ను స్టాలిన్‌కు చోడంకర్ అందజేసినట్టు తెలుస్తోంది. భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాలకు సంబంధించి డీఎంకే ఏర్పాటు చేయనున్న కమిటీతో ఈ ఐదుగురు సభ్యుల కమిటీ సంప్రదింపులు సాగించనుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 25 సీట్లును డీఎంకే కేటాయించగా ఈసారి 40 సీట్లను కాంగ్రెస్ కోరుతోందని, గెలిచే అవకాశాలు బలంగా ఉన్న నియోజకవర్గాలను ఆశిస్తోందని తెలుస్తోంది.
నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK)తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నట్టు ఊహాగానాలు బలంగా వినిపించడంతో దీనిపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డీఎంకే ఇటీవల కోరింది. దీంతో గత నవంబర్ 22న ఐదుగురు సభ్యుల కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి..
హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ఢిల్లీకి బయలుదేరిన డీకే.. ఏమన్నారంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి