Renuka Chowdhury: హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ABN , Publish Date - Dec 03 , 2025 | 08:37 PM
పార్లమెంటు ఆవరణలోకి కుక్కలు రాకూడదనే నిషేధం ఏదీ లేదని, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఒకసారి ఎద్దులబండిపై వచ్చారని రేణుకాచౌదరి గుర్తుచేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) తన కారులో ఒక కుక్కను తీసుకుని పార్లమెంటు ఆవరణలోకి రావడం ఇటీవల సంచలనమైంది. ఎంపీలకు కల్పించిన హక్కులకు ఇది విరుద్ధమని బీజేపీ దీనిపై మండిపడగా, ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టనున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై పార్లమెంటు వెలుపల ఆమెను మీడియా బుధవారంనాడు ప్రశ్నించినప్పుడు ఆమె 'బౌ బౌ' అంటూ రియాక్షన్ ఇచ్చారు. 'ఇంతకంటే ఏమి చెప్పాలి? వచ్చినప్పుడు (తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు) చూద్దాం. సమస్య ఏముంది? అది వచ్చినప్పుడు గట్టి సమాధానమిస్తాను' అని చెప్పారు.
పార్లమెంటు సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రేణుకా చౌదరి కారులో ఒక శునకాన్ని తీసుకుని పార్లమెంటు ఆవరణలోకి వచ్చారు. వెంటనే భద్రతాసిబ్బంది ఆ కుక్కను వెనక్కి పంపేశారు. తాను రోడ్డుపై వస్తున్నప్పుడు రెండు వాహనాలు ఢీకొని మధ్యలో కుక్కపిల్ల కనిపించిందని, అది గాయపడి ఉంటుందని భావించి కారులో తీసుకువచ్చానని, ఇక్కడకు వచ్చిన వెంటనే ఆ కుక్కను తన ఇంటికి పంపించేశానని చెప్పారు. ఇందులో సమస్య ఏముందని ప్రశ్నించారు. రేణుకా చౌదరి చర్యను బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తప్పుపట్టడంతో ఆమె తిరిగి స్పందించారు.
'కాలుష్యంతో జనం చనిపోతున్నారు. దానిపై ఎవరికీ ఎలాంటి బాధ లేదు. బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ల కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా వాళ్లకు ఎలాంటి పట్టింపూ లేదు. కార్మిక చట్టాలు రుద్దుతున్నారు. సంచార్ సాథీ యాప్ బలవంతంగా మనపై రుద్దుతున్నారు. కానీ రేణుకా చౌదరి కుక్క అందరికీ ఆందోళనకరమైన విషయంగా కనిపిస్తోంది. ఇంతకంటే ఏమి చెప్పాలి? మూగజీవాలను నేను ప్రేమిస్తూనే ఉంటాను' అని అన్నారు. పార్లమెంటు ఆవరణలోకి కుక్కలు రాకూడదనే నిషేధం ఏదీ లేదని, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఒకసారి ఎద్దులబండిపై వచ్చారని గుర్తుచేశారు. కుక్కలు ఎంతో విధేయతతో ఉంటాయని, విధేయత గురించి ఈ వ్యక్తులకేం తెలుసునని ప్రశ్నించారు. ఇప్పుడు కిరణ్ రిజిజు మాకు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తారా? అని అడిగారు.
'ముందు మీ పార్టీ విషయం చూసుకోండి. మీ మంత్రులు రైతులపై కార్లు ఎక్కించి చంపారు. మాకు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు కిరణ్ రిజిజు తమ పార్టీ వైపు చూసుకోవాలి. నాపై ఎవరు హక్కుల తీర్మానం పెడతారో నాకెలా తెలుస్తుంది వాళ్లకు అంత సమయం ఉందనుకుంటే, అంతగా కోరుకుంటే ఆ పని చేయొచ్చు. నాకెందుకు బాధ' అని సూటిగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీకి బయలుదేరిన డీకే.. ఏమన్నారంటే
ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి