Mallikarjun Kharge: అంతర్గత వివాదాలకు స్థానిక నాయకులే బాధ్యులు.. తేల్చేసిన ఖర్గే
ABN , Publish Date - Dec 21 , 2025 | 09:04 PM
అంతర్గత సమస్యలకు అధిష్టానంపై నిందలు వేయకుండా స్థానిక నాయకులే బాధ్యత వహించాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
కలబురగి: కర్ణాటకలో నాయకత్వం మార్పు అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై స్థానిక స్థాయిలోనే సమస్య ఉందని, పార్టీ అధిష్టానం ఎలాంటి గందరగోళం సృష్టించలేదని తెలిపారు. కలబురగిలో మీడియాతో ఆదివారంనాడు ఖర్గే మాట్లాడుతూ, హైకమాండ్ ఎలాంటి గందరగోళం సృష్టించలేదని స్పష్టం చేశారు. సమస్య స్థానిక స్థాయిలోనే ఉందని, అలాంటప్పుడు అధిష్టానంపై ఎలా నిందవేస్తారని ప్రశ్నించారు. అంతర్గత సమస్యలకు అధిష్టానంపై నిందలు వేయకుండా స్థానిక నాయకులే బాధ్యత వహించాలని అన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఏ ఒక్కరో ఆపాదించుకోవడం సరికాదని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు.
'పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఒక్కరి కృషి వల్ల ఏదీ కాదు. పార్టీ కార్యకర్తల వల్లే పార్టీ నిర్మాణం జరిగింది. కార్యకర్తలు పార్టీకి అండగా నిలిచారు. నాయకులు వ్యక్తిగత గొప్పలు చెప్పుకోకుండా కార్యకర్తల సమష్టి కృషిని గుర్తించాలి' అని ఖర్గే అన్నారు.
అధిష్టానాన్ని కలుసుకునేందుకు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్తున్నారా అని అడిగినప్పుడు దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఖర్గే సమాధానమిచ్చారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసే విషయంలో అధిష్టానం మద్దతు తనకే ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల అసెంబ్లీలో ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖర్గే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
'జీ రామ్ జీ' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
సెక్యులర్ సాంగ్ పాడాలంటూ బెంగాల్ సింగర్‌కు వేధింపులు.. ఒకరి అరెస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి