Bengal Singer Harassed: సెక్యులర్ సాంగ్ పాడాలంటూ బెంగాల్ సింగర్‌కు వేధింపులు.. ఒకరి అరెస్టు
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:33 PM
వసంతం వచ్చేసింది.. అనే బెంగాలీ పాటతో పాపులర్ అయిన చక్రవర్తి ఆ పాటను పాడుతుండగా మాలిక్ స్టేజ్‌పైకి వచ్చి పెద్దగా అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని తన ఫిర్యాదులో చక్రవర్తి పేర్కొన్నారు.
కోల్‌కతా: ఒక పాఠశాలలో జరిగిన లైవ్ కన్సర్ట్‌లో బెంగాల్ సింగర్ లగ్నజిత చక్రవర్తి (Lagnajita Chakraborty)ని సెక్యులర్ సాంగ్ పాడాలంటూ వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ మిడ్నాపూర్‌లోని భగవాన్‌పూర్‌లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో లైవ్‌షో సమయంలో తనను మహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేధించి, దాడి చేసేందుకు ప్రయత్నించాడంటూ చక్రవర్తి ఆరోపించారు.
కాగా, స్కూలు ఓనర్‌గా ఉన్న మాలిక్ ఈ లైవ్ కన్సర్ట్ ప్రధాన ఆర్గనైజర్‌గా కూడా వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు. 'వసంతం వచ్చేసింది' అనే బెంగాలీ పాటతో పాపులర్ అయిన చక్రవర్తి ఆ పాటను పాడుతుండగా మాలిక్ స్టేజ్‌పైకి వచ్చి పెద్దగా అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. భక్తి పాట కాకుండా సెక్యులర్ పాట పాడాలని తనపై ఒత్తిడి చేసినట్టు ఆమె వాపోయారు. ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేసినప్పటికీ భగవాన్‌పూర్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి ఆఫీసరు కేసు నమోదు చేసేందుకు నిరాకరించినట్టు తెలిపారు. అయితే ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసిన మాలిక్‌ను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిపై శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించామని, తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి మిథున్ దేవ్ తెలిపారు.
కాగా, మాలిక్‌పై చేసిన ఆరోపణలు నిరాధామని ఆయన సోదరుడు మసూద్ మాలిక్ తెలిపారు. స్టేజ్‌పై అదనపు సమయానికి అదనపు సొమ్మును ఆమె డిమాండ్ చేసిందని చెప్పారు. త్వరలో రానున్న ఒక సినిమాలోని మతపరమైన పాటను చక్రవర్తి పాడారని, స్కూలు ఫంక్షన్ కావడంతో ఒక సెక్యులర్ పాట పాడమని మాలిక్ కోరారని, దీంతో ఆమె తన ప్రదర్శన ఆపేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని తెలిపారు. అదనపు సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించినందు వల్లే ఆమె ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కాగా, మసూద్ మాలిక్ ఆరోపణలను కూడా చక్రవర్తి తోసిపుచ్చారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని, తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.
బీజేపీ విమర్శ
మరోవైపు, లగ్నిజత చక్రవర్తిపై దాడికి ప్రయత్నించడాన్ని బీజేపీ ఖండించింది. జిహాదీల గుప్పిట్లో పశ్చిమబెంగాల్ ఉందని, ఏ పాట పాడాలో ఏ పాట పాడకూడదో కూడా వాళ్లే నిర్దేశిస్తారని, ఇది పూర్తిగా హిందూ వ్యతిరేక చర్య అని బీజేపీ నేత షాకుదేబ్ పాండ విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి సింగర్ వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని చెప్పారు. కాగా, ఈ ఘటనపై టీఎంసీ వెంటనే స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్
మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి