BJP: టాస్మాక్ అవినీతిపై బీజేపీ పోరు.. త్వరలో సీఎం ఇంటి ముట్టడి
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:31 AM
టాస్మాక్ అవినీతిని ఖండిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని ముట్టడించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టాస్మాక్ సంస్థలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
- అన్నామలై, తమిళిసై, ఎమ్మెల్యేల అరెస్ట్
చెన్నై: రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని టాస్మాక్ సంస్థలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నగరంలో సోమవారం ఉదయం ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, రాస్తారోకో, ధర్నాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP State President Annanalai), మాజీ అధ్యక్షురాలు తమిళిసై, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ సహా పలువురిని అరెస్టు చేశారు. పలు జిల్లాల్లో బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేసే టాస్మాక్ సంస్థ, మద్యం తయారీ కర్మాగారాల్లో ఆకస్మిక తనిఖీల్లో నిర్వహించిన ఈడీ అధికారులు దాదాపు రూ.1,000 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవల ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: Nirmala Sitharaman: పదేళ్లలో రూ.16.35 లక్షల కోట్లు
ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, బీజేపీ, ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం, పీఎంకే తదితర పార్టీలు టాస్మాక్ సంస్థ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టాస్మాక్ అవినీతిని ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఎగ్మూర్‌లోవున్న టాస్మాక్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. దీంతో ఉదయం 6 గంటలకే అక్కడకు చేరుకున్న పోలీసులు టాస్మాక్ కార్యాలయం ముట్టిడికి యత్నించిన బీజేపీ సీనియర్ నేత ఎం.చక్రవర్తి, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్‌సెల్వం తదితరులను అరెస్టు చేశారు.
అదేవిధంగా సచివాలయాన్ని ముట్టడించేందుకు ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం నుండి ర్యాలీగా వెళ్ళిన సుమారు వంద మంది కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. సాలిగ్రామంలోవున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంటిముందు సుమారు 50మందికి పైగా పోలీసులు మోహరించారు. పోలీసులు వారిస్తున్నా లెక్కచేయని తమిళిసై పార్టీ కార్యకర్తలతో కలిసి ఎగ్మూర్‌లోని టాస్మాక్ ప్రధాన కార్యాలయానికి బయల్దేరడంతో వారిని కూడా అరెస్టు చేశారు. అదేవిధంగా పనైయూర్‌లోవున్న బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇంటిముందు పోలీసులు మోహరించారు. ఉదయం 11.10గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అన్నామలైను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం కారులో ఈసీఆర్ రోడ్డులోవున్న అక్కరై ప్రాంతానికి చేరుకున్న అన్నామలై, పార్టీశ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రమాజీ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, సీనియర్ నేత హెచ్.రాజా, రాష్ట్ర ఉపాధ్యక్షులు కరు నాగరాజన్, వీపీ.దురైస్వామి, రాష్ట్రకార్యదర్శి కరాటే త్యాగరాజన్‌తో పాటు మహిళా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. ఆందోళనాకారులను పోలీసు వాహనాల ద్వారా ఆయా ప్రాంతాల్లోవున్న ప్రభుత్వ మైదానాలు, కల్యాణమండపాలు, రాజరత్నం స్టేడియం తదితర ప్రాంతాలకు తరలించారు. అయితే అరస్టయిన వారిలో వున్న మహిళలు మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
త్వరలో సీఎం ఇంటి ముట్టడి: అన్నామలై
టాస్మాక్ అవినీతిని ఖండిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఇంటిని ముట్టడించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. సోమవారం ఉదయం అరెస్టయిన సందర్భంగా అన్నామలై మీడియాతో మాట్లాడుతూ, టాస్మాక్ సంస్థలో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఈడీ వెల్లడించడంపై డీఎంకే ప్రభుత్వం ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లాగే సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో కూడా జరిగిందని, ఈ గుట్టు బయటపడుతుందనే భయంతోనే బీజేపీ నేతలను, తనను పోలీసులు అరెస్టు చేయడం ఖండించదగ్గదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News