Gold Smuggling: టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:06 AM
అధికారులు స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? గోల్డ్ స్మగ్లర్లతో కస్టమ్స్ అధికారులు కుమ్మక్కవుతున్నారా? అస్మదీయుల స్మగ్లింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారా.
యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా
ఏటా 300 టన్నుల అక్రమ బంగారం..!!
స్మగ్లర్లకు కస్టమ్స్‌లో ఇంటి దొంగల సహకారం
ఒక్క అధికారి సహకరించినా స్మగ్లర్లకు పండగే
ఈ కేసుల్లో మూలాలకు వెళ్లని దర్యాప్తు సంస్థలు
శంషాబాద్‌లో.. రన్యారావులెందరో..!
బంగారం స్మగ్లింగ్‌లో మహిళలదే కీలక పాత్ర
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ‘బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యారావు అరెస్టు.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారం సీజ్’.. ‘శంషాబాద్ విమానాశ్రయంలో మలద్వారంలో 3 కిలోల బంగారం గుర్తింపు.. ఒకరి అరెస్టు’.. ‘మిక్సర్-గ్రైండర్ మోటార్‌లో మూడు కిలోల బంగారంతో వైండింగ్.. ఇద్దరు మహిళల అరెస్టు’.. ‘పౌడర్/పేస్ట్ రూపంలో బంగారం.. 7 కిలోలు సీజ్.. ముగ్గురికి బేడీలు’.. పత్రికల్లో ఇలాంటి వార్తలు నిత్యకృత్యమయ్యాయి..! కేరళలో ఏకంగా సీఎం పినరయి విజయన్‌ను వణికించిన స్వప్న సురేశ్ కేసులోనూ బంగారం అక్రమ రవాణా కోణం ఉన్న విషయం తెలిసిందే..! గోల్డ్ స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6శాతానికి తగ్గించినా.. అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదు? అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం జాడను ఇట్టే పసిగట్టే యంత్రాలున్నా.. అధికారులు స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? గోల్డ్ స్మగ్లర్లతో కస్టమ్స్ అధికారులు కుమ్మక్కవుతున్నారా? అస్మదీయుల స్మగ్లింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారా?
30% అక్రమ బంగారమే..!
దేశంలో జరుగుతున్న బంగారం క్రయవిక్రయాల్లో 30ు అక్రమ మార్గాల్లో దిగుమతి అయినదేనని ఓ నివేదిక స్పష్టం చేస్తుంది. టన్నుల్లో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంటే.. కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు పట్టుకుంటున్నది కేవలం కిలోలు, గ్రాముల్లోనే కావడం గమనార్హం..! అంటే.. బంగారం స్మగ్లింగ్‌లో దొరికితే దొంగ.. లేకుంటే దొర అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. టన్నుల కొద్దీ దొంగ బంగారం చేరాల్సిన చోటికి సేఫ్‌గా చేరిపోతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) అంచనా మేరకు 2022లో దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది. అందుక్కారణం.. దిగుమతి సుంకాన్ని సర్కారు 7.5ు నుంచి 12.5శాతానికి పెంచడమే..! ఆ తర్వాత ఈ సుంకాన్ని 15శాతానికి పెంచారు. అయితే.. బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఈ సుంకాన్ని 6శాతానికి తగ్గించింది. దీంతో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.4 వేల మేర తగ్గాయి. అయినా.. గోల్డ్‌స్మగ్లింగ్ తగ్గకపోగా.. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఏటా భారత్‌కు 700 టన్నుల మేర బంగారం దిగుమతి అవుతుండగా.. అందులో 400 టన్నులు చట్టబద్ధంగా వస్తోందని, మిగతా 300 టన్నులు స్మగ్లింగేనని కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. దేశంలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం(22 క్యారెట్లు) ధర సుమారు రూ.82వేలుగా ఉంది. అదే 24క్యారెట్ల బంగారం అయితే.. రూ.89,820 + 3ు జీఎస్టీ చెల్లించాలి. అంటే.. రూ.92వేల పైచిలుకు ఖర్చవుతుంది. దుబాయ్ వంటి దేశాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.82,976కే లభిస్తోంది. తేడా సుమారు రూ.8వేలు. దాన్ని 22క్యారెట్లుగా మారిస్తే.. 10.91 గ్రాములు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కిలో బంగారాన్ని అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకుంటే.. రూ.20 లక్షల మేర స్మగ్లర్లకు లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్ ఇతర దేశాల నుంచి రవాణా, అధికారులకు లంచాలు పోను.. కిలోకు రూ.19 లక్షల వరకు మిగులుతుందని అంచనా..! స్మగ్లరు ఒకట్రెండు కిలోలు కాకుండా.. ఒకే విడతలో వేర్వేరు ప్రయాణికులకు 10-20 కిలోల మేర బంగారాన్ని అంటగట్టి పంపుతారని తెలుస్తోంది. దీన్ని బట్టి వారి లాభాలు రూ.1.9 కోట్ల నుంచి రూ.3.8 కోట్ల వరకు ఉంటాయి.
కస్టమ్స్ అధికారుల పాత్ర..
నిజానికి సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో.. కస్టమ్స్ విభాగంలో పనిచేసేవారు నిబద్ధతతో ఉంటారనే పేరుంది. అయితే.. కొందరు అధికారులు మాత్రం తప్పుదారి పడుతూ.. స్మగ్లర్లకు సహకరిస్తుంటారని సమాచారం. కస్టమ్స్ విభాగాల్లో పనిచేసేవారు రెండేళ్ల వరకు మాత్రమే విమానాశ్రయాల్లో పనిచేస్తారు. ఈ రెండేళ్లలో అందినకాడికి సంపాదించడమే లక్ష్యంగా కొందరు స్మగ్లర్లతో అంటకాగుతున్నారు. అంటే.. అక్రమ బంగారాన్ని అడ్డంకులు లేకుండా విమానాశ్రయం దాటేలా చేస్తారు. ఇలా కిలో బంగారానికి కస్టమ్స్ అధికారులకు రూ.50వేల దాకా ముడుతున్నట్లు సమాచారం. దాంతో.. సింహభాగం బంగారం యథేచ్ఛగా బయటకు వెళ్తుండగా.. 10ు లోపు అక్రమ బంగారాన్ని మాత్రం సీజ్ చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు.
ఇంటర్నేషనల్.. డొమెస్టిక్‌గా మారినప్పుడు
అంతర్జాతీయ విమానాల్లో భారత్‌కు వచ్చిన వారికి కస్టమ్స్ తనిఖీలు ఉంటాయి. అయితే.. కొన్ని అంతర్జాతీయ విమానాలు ముంబై, న్యూఢిల్లీ లాంటి విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యాక.. డొమెస్టిక్‌గా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. స్మగ్లర్లు పురమాయించిన ప్రయాణికులు ఇలాంటి విమానాల్లో సీట్ల కింద లేదా సీట్ల పక్కన ఉండే సందుల్లో బంగారాన్ని దాచేస్తుంటారు. సరిగ్గా ఆ విమానాలు డొమెస్టిక్‌గా మారినప్పుడు స్మగ్లర్లు తమవారి కోసమే ఆయా సీట్ నంబర్లకు టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఈ ముఠాకు చెందిన మరో ప్రయాణికుడు ఆ బంగారాన్ని తీసుకుని, గమ్యస్థాన విమానాశ్రయంలో దిగిపోతాడు. అది డొమెస్టిక్ విమానం కావడంతో కస్టమ్స్ తనిఖీలు ఉండవు. ఇలాంటి విమానాల్లో పనిచేసే సిబ్బంది, ఆయా విమానాశ్రయాల్లో పనిచేసేవారు స్మగ్లర్లతో అంటకాగుతున్నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ఇంటిదొంగలను ఆయా విమానయాన సంస్థలు ఎప్పటికప్పుడు పసిగడుతున్నా.. బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ మహిళ 1,600 గ్రాముల బంగారం ఉన్న బ్యాగును ఫ్లైట్ సిబ్బందికి ఇవ్వగా.. అతను దాన్ని కిటికీలోంచి బయటకు పారేశారు. సీసీ ఫుటేజీ ద్వారా విమానయాన సంస్థ ఈ విషయాన్ని గుర్తించి, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంది. అడపాదడపా కస్టమ్స్/డీఆర్‌ఐ అధికారులు స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని సీజ్ చేసి, సరఫరాదారును అరెస్టు చేసినా.. సూత్రధారులను అరెస్టు చేసేదాకా దర్యాప్తు సాగడం లేదు.
నిత్యం వార్తల్లో శంషాబాద్..!
బంగారం అక్రమ రవాణాకు సంబంధించి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం వార్తల్లో ఉంటోంది. ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ విమానాశ్రయాల తరహాలో భారీ ఎత్తున బంగారం పట్టుబడకున్నా.. అడపాదడపా చెప్పుకోదగ్గ స్థాయిలో పసిడి సీజ్ అవుతోంది. నగరానికి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే.. వీరికి తనిఖీలు పెద్దగా ఉండవు. దాంతో స్మగ్లర్లు మహిళలను బంగారం అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది. లోదుస్తుల్లో.. పాదరక్షల్లో..చివరకు పౌడర్, పేస్ట్ రూపంలో బంగారాన్ని క్యాప్సుల్స్‌గా మార్చి, మర్మావయవాల్లో, మలద్వారంలో, పొట్టలో దాచుకుని.. తీసుకొస్తున్నారు.
కఠిన శిక్షలతోనే భయం
ఏ విమానాశ్రయంలోనైనా కస్టమ్స్ విభాగానికి చెందిన ఒక్క ఉద్యోగి పరిచయమున్నా.. స్మగ్లర్ల పని సులభమవుతుంది. సాధారణ ప్రజలే కాకుండా వీఐపీలు ఎక్కువగా సరుకు అక్రమ రవాణా చేస్తుంటారు. వీఐపీలకు గ్రీన్‌చానల్ ఉంటుంది. దాంతో.. వారి పని సులువు అవుతుంది. ఎవరైనా అధికారి లేదా సిబ్బంది స్మగ్లర్లకు సహకరిస్తే.. వారికి శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే.. అక్రమ రవాణా అంటే వారిలో భయం ఉంటుంది.
- సెంట్రల్ ఎక్సైజ్ విశ్రాంత అధికారి సుధాకర్
చట్టాలు ఏం చెబుతున్నాయి?
పాస్‌పోర్టు చట్టం-1967, కస్టమ్స్ చట్టాల ప్రకారం ప్రయాణికులు నిర్ణీత మొత్తంలో బంగారాన్ని భారత్‌కు తెచ్చుకోవొచ్చు.
దుబాయ్ వంటి దేశాల్లో ఆర్నెల్లకంటే ఎక్కువగా ఉన్న పురుషులు 20 గ్రాములు, మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలు 40గ్రాముల బంగారాన్ని తీసుకువస్తే.. ఎలాంటి సుంకాలు ఉండవు.
ఇంతకు మించి అదనపు బంగారం తీసుకురావాలంటే.. సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. పురుషులకు 20 నుంచి 50 గ్రాముల అదనపు బంగారానికి 3ు, 50-100 గ్రాములకు 6ు, 100 గ్రాములకు మించిన బంగారానికి 10ు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. మహిళలు, పిల్లలకు 40-100 గ్రాములకు 3ు, 100-200 గ్రాములకు 6ు, 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10ు మేర కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాలి.
దుబాయ్‌లో ఆర్నెల్లలోపు ఉండి.. తిరిగి వచ్చేవారికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. వారు 38.5ు మేర కస్టమ్స్ సుంకాలను చెల్లించాల్సిందే.