Heavy Rains: వీడని వాన.. చెన్నైలో ఏకబిగిన 32 గంటల పాటు జల్లులు..
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:06 PM
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనాలు, ప్రస్తుతం ముంథా తుఫాన్ కారణంగా నగరంలో పక్షం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (32 గంటలపాటు) నగరం, శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
- ఎన్నూరులో 13 సెం.మీ.ల వర్షపాతం నమోదు
చెన్నై: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనాలు, ప్రస్తుతం ముంథా తుఫాన్ కారణంగా నగరంలో పక్షం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (32 గంటలపాటు) నగరం, శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఈ వర్షాలకు తోడు విపరీతమైన చలిగాలులు కూడా వీస్తుండటంతో నగరవాసులు వణకిపోతున్నారు.

‘ముంథా’ తుఫాన్ కాకినాడ(Kakinada) దిశగా వెళుతున్నప్పటికీ ఆ తుఫాను కారణంగా సముద్రతీర ప్రాంతాల్లో గంటలకు 50 కి.మీ.ల వేగంతో పెనుగాలుల కారణంగా వర్షం కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో నగరంలోను, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలోని తట్టాన్‌కుళం, కేఎం గార్డెన్, మాధవరం, పెరియార్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన నీరు వరదలా ప్రవహిస్తోంది. ఈ నీటిని కార్పొరేషన్ అధికారులు మోటారు పంపుల ద్వారా తొలగించారు.
అదే సమయంలో విద్యుత్ సరఫరాకు కూడా ఎలాంటి అంతరాయాలు సంభవించలేదన్నారు. ఎన్నూరులో 13 సెం.మీలు. కత్తివాక్కం వద్ద 10 సెం.మీ.లు, విమ్కోనగర్‌లో 9 సెం.మీ.లు, మాధవరం, మణలి పుదునగర్, మేడవాక్కం ప్రాంతంలో 8 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. పొన్నేరి, అంబత్తూరు, బేసిన్‌బ్రిడ్జ్, ఆవడి, పెరంబూరు, తండయార్‌పేట ప్రాంతాల్లో 7 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

రిజర్వాయర్లలో పెరిగిన నీటిమట్టం...
‘మొంథా’ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగరానికి మంచి నీరు అందించే ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పుళల్ జలాశయానికి ఇన్‌ఫ్లో సెకనుకు 265 ఘనపుటడుగుల నుండి 556 ఘనపుటడుగులకు పెరిగింది. ఈ జలాశయం సామర్థ్యం 21 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 18.49 అడుగులకు చేరింది. పూండి రిజర్వాయర్‌లోను మంగళవారం ఉదయం ఇన్‌ఫ్లో సెకనుకు 4650 ఘనపుటడుగుల మేర నమోదైంది. ఆ రిజర్వాయర్ నుండి సెకనకు 7 వేల ఘనపుటడుగుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. చెంబరంబాక్కం జలాశయంలో మంగళవారం ఉదయం ఇన్‌ఫ్లో సెకనుకు 1221 ఘనపుటడుగులకు పెరిగింది. ఆ జలాశయం సామర్థ్యం 24 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 21.28 అడుగులకు చేరింది.
జలదిగ్బంధంలో 4వేల ఇళ్లు...
నగర శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో సుమారు 4వేలకు పైగా ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆవడి కార్పొరేసణ్ పరిధిలో కోవిల్‌పతాగై, 20, 37 వార్డులు, పట్టాభిరామ్ గోపాలపురం, తెండ్ర ల్ నగర్ ప్రాంతాల్లో సుమారు 2 వేల ఇళ్ల చుట్టూ వర్షపునీరు ప్రవహిస్తోది.
తిరువళ్లూరు జిల్లాలో...
తిరువళ్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ జిల్లాలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. తిరుత్తణిలో మంగళవారం ఉదయం భారీగా వర్షం కురిసి జనావాస ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
జిల్లాల్లో గరిష్ఠంగా పొన్నేరిలో 7 సెం.మీలు, ఆవడిలో 6.7 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఊత్తుకోటలో 61మి.మీ.లు, రెడ్‌హిల్స్‌లో 52 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి పలు ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. అన్నాసాలై, గిండి, పూందమల్లి, క్రోంపేట జీఎస్టీ రోడ్డు, ఈస్ట్‌కోస్టు రోడ్డు, తిరువాన్మియూరు, అడయార్, పట్టినంబాక్కం, మెరీనాబీచ్ ప్రాంతం తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ వాహనదారులు అవస్థలుపడ్డారు. ఇదే విధంగా పూందమల్లి హైరోర్డు, మందవెల్లి, మైలాపూరు ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News