Heavy Rains: హమ్మయ్య.. కాస్త తెరపిచ్చిందిగా...
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:36 PM
గత నాలుగు రోజులుగా చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు కాస్త తెరపిచ్చాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఇళ్లనుంచి బయటకు కూడా రాలేకపోయారు. అయితే.. కాస్త తెరపివ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
- శాంతించిన వర్షం
చెన్నై: ‘దిత్వా’ తుపాను, ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాల కారణంగా నాలుగు రోజులపాటు చెన్నై, పరిసర జిల్లాలను ముంచెత్తిన వర్షం కాస్త తెరపిచ్చింది. మబ్బుల మాటునే దాగిన సూరీడు ఎట్టకేలకు బయటపడడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల దాకా నగరంలోను, తిరువళ్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోనూ ఎండ బాగానే కాసింది. ఆ తర్వాత క్షణాలలోనే మళ్లీ ఆకాశం మేఘావృతమై జల్లులతో ప్రారంభమైన వర్షం కాస్త వేగం అందుకుంది.

మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జోరుగా వర్షం కురిసింది. వడపళని, గిండి, ఆలందూరు, మీనంబాక్కం, పల్లావరం, క్రోంపేట, తాంబరం, పట్టినంబాక్కం, అంబత్తూరు, తిరుమంగళం, అన్నానగర్, మధురవాయల్, రాయపేట, ట్రిప్లికేన్, మైలాపూరు, విల్లివాక్కం తదితర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఇదే విధంగా తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోనూ సాయంత్రం చెదురుముదురుగా వర్షం కురిసింది.

ఇదిలా ఉండగా నగర శివారు ప్రాంతం రెడ్‌హిల్స్‌లో గత మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో చేరిన వర్షపునీరు తొలగించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాధవరం, వడపెరుంబాక్కం, రెడ్‌హిల్స్, విలాంగాడుపాక్కం, అలింజివాక్కం తదితర ప్రాంతాలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. ఈ నీటిని తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపించారు.
3 జిల్లాలకు భారీ వర్ష సూచన
శుక్రవారం తెన్‌కాశి, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. నగరానికి సంబంధించినంత వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపారు. తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో కొన్ని చోట్ల చెదురుముదురుగా వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్ కన్సల్టెంట్లతో ఒప్పందం
Read Latest Telangana News and National News