Waqf Board: వక్ఫ్ బిల్లుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు! ఏం అందంటే..
ABN , Publish Date - May 21 , 2025 | 04:28 PM
వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంలో విచారణలో సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ ఇస్లామిక్ భావన అంటూనే ట్విస్ట్ ఇచ్చింది. కేంద్రం ఇంకా ఏం అందంటే..
వక్ఫ్ సవరణ చట్టం-2025పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే గానీ ఇది ఇస్లాంలో కీలక భాగం కాదని తెలిపింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద మంగళవారంతో పాటు ఇవాళ కూడా విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే గానీ ఇస్లాంలో కీలక భాగం కాదన్నారు. ఇది ప్రాథమిక హక్కు కాదన్నారు తుషార్ మెహతా. ఆయన ఇంకా ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం..
పక్కదారి పట్టిస్తే ఊరుకోం!
దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను, వాళ్ల ఆస్తుల్ని సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నారు తుషార్ మెహతా. ప్రజల ఆస్తులను అక్రమంగా పక్కదారి పట్టించే ప్రయత్నాలను సర్కారు చూస్తూ ఊరుకోదన్నారు. వక్ఫ్ చట్టంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఉన్నది సేవ కోసమేనని ఆయన స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు ఉంటే వచ్చే నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇందులో మతపరమైన అంశాల జోక్యమేమీ లేదన్నారు. వక్ఫ్ చట్టం సవరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏకంగా 96 లక్షల మంది ముస్లింలను కలిసిందన్నారు తుషార్ మెహతా. చర్చోపచర్చల తర్వాత అందరి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని కేంద్రం చట్టాన్ని సవరించిందన్నారు.
ఇవీ చదవండి:
ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి