Shashi Tharoor: ట్రంప్.. పాదరసం వంటి స్వభావం కలిగిన వ్యక్తి.. ట్రంప్ కొత్త స్వరంపై శశిథరూర్
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:03 PM
ట్రంప్ పాదరసం వంటి స్వభావం కలిగిన వ్యక్తి అని శశిథరూర్ అభివర్ణించారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలానే ఉన్నాయని, ఆయన మాట్లాడిన మాటలు పలువురిని గాయపరిచాయని, 50 శాతం టారిఫ్ ప్రభావం ఇప్పటికే మనపై పడిందని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: భారత్, అమెరికాల మధ్య బంధం చాలా ప్రత్యేకమైందంటూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ప్రశంసలతో ముంచెత్తడం, ఆ వెంటనే ట్రంప్ భావాలు, ఇరుదేశాల సంబంధాలపై ఆయన సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నానని మోదీ స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కొత్త స్వరాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అయితే ట్రంప్ చేసిన అవమానాలను అంత తేలికగా మరిచిపోలేమని అన్నారు. ప్రధాని త్వరగానే స్పందించినప్పటికీ ఇరు ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన మరమ్మతులు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు.
'ప్రధాని చాలా వేగంగా స్పందించారు, విదేశాంగ మంత్రి కూడా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యమనే ప్రాథమిక సంబంధం ప్రాధాన్యతను బలంగా చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. మనం ఇవ్వాల్సిన ముఖ్య సందేశం కూడా అదే. ఇరువైపులా ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ట్రంప్ మారిన స్వరాన్ని స్వాగతిస్తున్నా. అయితే భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలానే ఉన్నాయి. అందువల్ల అంత త్వరగా వారు క్షమించలేరు. ఈ పరిణామాలను అధిగమించాల్సి ఉంటుంది' అని శశిథరూర్ అన్నారు.
ట్రంప్ పాదరసం వంటి స్వభావం కలిగిన వ్యక్తి అని శశిథరూర్ అభివర్ణించారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలానే ఉన్నాయని, ఆయన మాట్లాడిన మాటలు పలువురిని గాయపరిచాయని మండిపడ్డారు. 50 శాతం టారిఫ్ ప్రభావం ఇప్పటికే మనపై పడిందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
దేశంపై ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి
For More National News And Telugu News