EX Justice Sudarshan Reddy: దేశంపై ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:09 AM
దేశం పట్ల ప్రేమ ఉంటే తనను ఉప రాష్ట్రపతిగా గెలిపించాలని ఇండియా కూటమి తరఫున బరిలో నిలిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి..
నాకు ఓటు వేస్తే.. భారతదేశ స్ఫూర్తికి వేసినట్లే
ఉపరాష్ట్రపతిగా చాన్స్ ఇస్తే పార్లమెంటరీ సంప్రదాయాల్ని రక్షిస్తా
లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లేఖ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశం పట్ల ప్రేమ ఉంటే తనను ఉప రాష్ట్రపతిగా గెలిపించాలని ఇండియా కూటమి తరఫున బరిలో నిలిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి.. పార్లమెంటు సభ్యులను కోరారు. తాను వ్యక్తిగా మద్దతు కోరడం లేదని, సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా భారతదేశ విలువలను గౌరవించేందుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ విధేయంగా ఉండాల్సిన అవసరం లేదని, ఏ పార్టీ విప్ జారీ చేయదని తెలిపారు. రహస్య బ్యాలెట్ ప్రకారం ఓటింగ్ జరుగుతుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ తమ అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. ఈ మేరకు ఉభయ సభల ఎంపీలకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆదివారం లేఖ రాశారు. తనను ఎన్నుకుంటే.. పార్లమెంట్ సంప్రదాయాన్ని కాపాడినట్లు, చర్చల హుందాతనాన్ని పునరుద్ధరించినట్లు అవుతుందన్నారు. తనకు ఓటు వేయడం భారతదేశ స్ఫూర్తికి ఓటు వేయడమేనని, భవిష్యత్తు తరాలు గర్వపడేలా మన రిపబ్లిక్‌ను కాపాడాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామిక విలువలు క్షీణిస్తున్నాయని, హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రజాసేవలో అనుభవం ఉన్న తనకు ప్రజాస్వామ్య తీరుతెన్నులు తెలుసునని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తనకు అవకాశమిస్తే పార్లమెంటరీ సంప్రదాయాలను నిష్పాక్షికంగా, హుందాగా పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. తాను మాజీ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను అనుసరిస్తూ జాతీయ ప్రయోజనాలను కాపాడతానన్నారు. తక్షణ రాజకీయ ఒతిళ్లకు లోను కాకుండా.. సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షిస్తానని, నిబంధనల్ని అమలు చేయడంతోనే సరిపెట్టుకోకుండా చర్చల పవిత్రతను కాపాడుతానని హామీ ఇచ్చారు.