BMC Elections2025: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు.. 150 సీట్లలో పోటీ యోచన
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:49 PM
శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్)తో కూడిన 'మహా వికాస్ అఘాడి'లో అంతర్గత విభేదాలున్నాయని, దీనిని అవకాశంగా మలుచుకుని ఎంవీఏకు సంప్రదాయంగా పట్టున్న ప్రాంతాల్లో పాగా వేయాలని బీజేపీ ఆలోచనగా ఉంది.
ముంబై: త్వరలో జరుగనున్న ప్రతిష్టాత్మక బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ (BJP) కసరత్తు ప్రారంభించింది. మహాయుతి కూటమి (Mahayuti Alliance)లో భాగంగా 140 నుంచి 150 సీట్లలో పోటీ చేయాలని కమలనాథుల ఆలోచనగా ఉంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 70 నుంచి 80 సీట్లలో పోటీ చేసే అవకాశాలున్నాయి.
శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్)తో కూడిన 'మహా వికాస్ అఘాడి' (MVA)లో అంతర్గత విభేదాలున్నాయని, దీనిని అవకాశంగా మలుచుకుని ఎంవీఏకు సంప్రదాయంగా పట్టున్న ప్రాంతాల్లో పాగా వేయాలని బీజేపీ ఆలోచనగా ఉంది. ఇందుకు అనుగుణంగా బూత్ మేనేజిమెంట్, ఓటర్లను నేరుగా కలుసుకోవడం, స్థానిక సమస్యలపై ముంబై బీజేపీ యూనిట్ దృష్టి సారించింది. కూటమి భాగస్వామ్య నేతలు ఐకమత్యంగా ఉండాలని, ఎలాంటి ప్రకటనలు చేయకుండా సంయమనం పాటించాలని, అంతర్గత విభేదాలకు తావీయరాదని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మహాయుతి కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు.
బీఎంసీ ఎన్నికలు ఇటు మహాయుతి కూటమితో పాటు ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడికి కూడా కీలకమే. ముంబై మున్సిపల్ పవర్ డైనమిక్స్ ప్రభావం 2029లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ఉంటుందని పరిశీలకుల అభిప్రాయంగా ఉంది.
బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే పొత్తు పెట్టుకుంటారనే బలమైన అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో బీజేపీ సైతం ఒంటరిగా పోటీకి వెళ్లాలని అనుకోవడం లేదు. హిందుత్వ ఓట్లు, ప్రభుత్వ అనుకూల ఓట్లు చీలకుండా మహాయుతి భాగస్వామ్య పార్టీలతోనే కలిసి వెళ్లాలని భావిస్తోంది. వేర్వేరుగా పోటీ చేస్తే ఎంవీఏకు, ముఖ్యంగా మరాఠీల ప్రభావం ఎక్కువగా కనిపించే రాజ్ థాకరే ఎంఎన్ఎస్‌కు లబ్ధి చేకూరే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
మరాఠీల ఓట్లు, మైనారిటీ కమ్యూనిటీ ఓట్లను ఠాక్రే కూటమి ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని, బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా అగ్రవర్ణాల వాణిజ్య వర్గాలు, నార్త్ ఇండియన్లు, గుజరాజతీలు ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యత, సమన్వయంతో బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి సత్తా చాటాలని బీజేపీ వ్యూహరచనగా ఉంది.
ఇవి కూడా చదవండి..
12,000 ప్రత్యేక రైళ్లు ఎక్కడ.. కిక్కిరిసిపోతున్న బిహార్ రైళ్లపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్
యత్రీంద్ర అలా అనలేదు.. కుమారుడి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి