Share News

Shashi Tharoor: కాంగ్రెస్ వద్దన్నా.. కేంద్రం ఆహ్వానం.. హీట్ పుట్టిస్తున్న శశిథరూర్

ABN , Publish Date - May 17 , 2025 | 01:01 PM

Operation Sindoor: కాంగ్రెస్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య హీట్ పుట్టిస్తున్నారు ఎంపీ శశిథరూర్. హస్తం పార్టీ వద్దన్నా ఆయనకు ఆహ్వానం పంపింది మోదీ సర్కారు. అసలు శశిథరూర్ చుట్టూ ఏం జరుగుతోంది.. ఆయన సెంటరాఫ్ ది డిస్కషన్‌గా ఎందుకు మారారు.. అనేది ఇప్పుడు చూద్దాం..

Shashi Tharoor: కాంగ్రెస్ వద్దన్నా.. కేంద్రం ఆహ్వానం.. హీట్ పుట్టిస్తున్న శశిథరూర్
Congress MP Shashi Tharoor

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది భారత్. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ పేరుతో అక్కడి టెర్రరిస్టులతో పాటు వాళ్లకు అంటకాగుతున్న పాక్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టించింది ఇండియా. డ్రోన్లు, మిసైళ్ల దాడులతో శత్రుదేశానికి నిద్రలేకుండా చేసింది. ఇప్పుడు పాక్‌పై దౌత్య యుద్ధానికి కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు మోదీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ దేశాల ముందు పాక్ బండారాన్ని బయటపెట్టేందుకు, ఆ దేశ ఉగ్ర కుట్రల్ని అందరికీ అర్థమయ్యేలా విశదీకరించేందుకు 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చింది కేంద్రం. ఆ పార్టీ చెప్పకపోయినా.. ప్రముఖ ఎంపీ శశిథరూర్‌కు ఆహ్వానం పంపింది మోదీ సర్కారు. దీంతో హస్తిన రాజకీయాల్లో శశిథరూర్ సెంటరాఫ్ ది డిస్కషన్‌గా మారారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..


ఊహించని ట్విస్ట్

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలు కావాలని, వాళ్ల పేర్లతో కూడిన లిస్ట్‌ను పంపాలంటూ కాంగ్రెస్ పార్టీని కోరారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. దీంతో నలుగురు ఎంపీలతో కూడిన జాబితాను శనివారం నాడు పంపించింది హస్తం పార్టీ. ఇందులో ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ ఉన్నారు. అయితే లిస్ట్‌లో పక్కా ఉంటుందని భావించిన శశిథరూర్ పేరు మాత్రం ఇందులో లేదు. ఇది జరిగిన కొద్దిసేపటికే కేంద్రం ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను ప్రకటిచింది. ఇందులో కాంగ్రెస్ నుంచి శశిథరూర్ పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హస్తం పార్టీ పంపిన జాబితాలో థరూర్ పేరు లేకపోయినా ఆయన పేరును కేంద్రం ప్రకటించడం, విదేశానికి పంపనున్నట్లు వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది.


నేను సిద్ధం..

కేంద్ర ప్రభుత్వం తన పేరును ప్రకటించడంపై శశిథరూర్ స్పందించారు. అఖిలపక్ష బృందాన్ని నడిపించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. పహల్గాం దాడి నుంచి ఇటీవల చోటుచేసుకున్న కార్యకలాపాలపై భారత వైఖరిని ప్రపంచ దేశాల ముందు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దేశానికి తన సేవలు అవసరమైనప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. దీంతో థరూర్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ఆయన పేరును జోడించకపోయినా, కేంద్ర ప్రభుత్వం థరూర్‌కు పెద్దపీట వేయడం చర్చనీయాంశంగా మారింది.


ఇవీ చదవండి:

మరోసారి చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్‌

పాక్‌ నుంచి అఫ్గాన్‌ సరుకు ట్రక్కులకు అనుమతి

విజయ్‌ షాపై చర్యలు తీసుకోండి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 01:20 PM