Amit Sha: మీరు అంతర్గత కలహాలకు చెక్ పెడితే అధికారం మనదే..
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:19 AM
తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్‌షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.
- కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయండి
- బీజేపీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం
చెన్నై: తమిళనాడు(Tamil Nadu) బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్‌షా(Amit Sha)తో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్రపక్షాల సహకారంతో మరికొన్ని పార్టీలను కలుపుకుని కూటమి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అమిత్‌షా రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఏర్పాట్లు ముమ్మరం చేయగా, అమిత్‌షా కూడా ఇప్పటికే రెండు సార్లు రాష్ట్రానికివచ్చి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, కూటమిలోని మిత్రపక్షాల నేతలతో సమావేశమై కూటమి ఖరారుచేసి వెళ్లారు. అమిత్‌షా ఇచ్చి ప్రోత్సాహంతో రాష్ట్ర బీజేపీ అన్ని జిల్లాల్లో బూత్ కమిటీలను పటిష్ఠం చేసేలా తిరునల్వేలిలో తొలి మహానాడును విజయవంతంగా నిర్వహించింది. మరోవైపు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి విజయం కోసం మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటన దాదాపు 50 శాతానికి పైగా పూర్తయ్యింది.

ఈ కూటమిని ఎలాగైనా చీల్చేందుకు ఇండియా కూటమిలోని రాష్ట్రనేతలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ఓటు చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన పోరాటాలకు అధికార డీఎంకే మద్దతు తెలియజేయడంతో పాటు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బిహార్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని వలన రాష్ట్రంలో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా చేపడుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం ఎలా? కూటమిని మెజారిటీ సీట్లలో గెలిపించేందుకు వ్యవహరించాల్సిన తీరు, ఓటర్లను ఆకట్టుకునేలా సాగించాల్సిన ప్రచార యుక్తి, బూత్ కమిటీల పనితీరు.. తదితర అంశాలపై రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్‌షా మెళుకువలు నేర్పినట్లు సమాచారం.
బీజేపీ నేతల్లో ఏర్పడిన అభిప్రాయభేదాలను పక్కనబెట్టి పార్టీ ఓటు బ్యాంకు పెంచే దిశగా కృషిచేయాలని బీజేపీ శ్రేణులకు ఆయన సూచనలిచ్చినట్లు తెలిసింది. అమిత్‌షా ఆహ్వానం మేరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, సీనియర్ నాయకులు హెచ్.రాజా, కేశవ వినాయగం, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అరవింద్‌మేనన్, కో-ఇన్‌ఛార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరు కాగా, అన్నామలై ఈ సమావేశంలో పాల్గొనలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News