Akhilesh Yadav: నేపాల్ తరహా నిరసనలు ఇక్కడా చూడాల్సి వస్తుంది... అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 07:19 PM
రాంపూర్ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసునని, తప్పుడు విధానాలు, ఓట్ ఫ్రాడ్‌తో రాంపూర్ ఎన్నికలను కైవసం చేసుకున్నారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మిరాపూర్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఆయన ఆరోపించారు.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) తీరుపై విరుచుకుపడ్డారు. 'ఓట్ చోరీ' (Vote Chori)పై భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సాయపడుతోందని, ఇలాంటి పద్ధతులను ఎన్నికల సంఘం మానుకోకుంటే నేపాల్ తరహా నిరసనలను (Nepal-like Protests) దేశం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
'ఎక్కడా ఓట్ల చోరీ జరక్కుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉంది. ఓట్ల చోరీతో గెలవలేమని అనుకున్నప్పుడు వాళ్లు రివాల్వర్ పవర్‌తో ఓటును ఆపే ప్రయత్నం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితే తలెత్తితే మన పొరుగున ఉన్న నేపాల్‌లో జరిగినట్టే ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి' అని అఖిలేష్ అన్నారు. రాంపూర్ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసునని.. తప్పుడు విధానాలు, ఓట్ ఫ్రాడ్‌తో రాంపూర్ ఎన్నికలను కైవసం చేసుకున్నారని మండిపడ్డారు. అలాగే మీరాపూర్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఆరోపించారు. అయోధ్య ఎన్నికల్లో మంత్రి సహాయకుడు పట్టుబడ్డాడని అన్నారు.
మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపైనా అఖిలేష్ విమర్శలు చేశారు. ఆయన విదేశాంగ విధానం చాలా సందర్భాల్లో విజయవంతం కాలేదని అన్నారు. అయితే భారతదేశ సరిహద్దులు, పొరుగుదేశాల్లో శాంతి నెలకొనేలా కేంద్రం చూడాలని కోరారు.
కొత్త లుక్‌లో అఖిలేష్
మీడియా సమావేశంలో అఖిలేష్ కొత్త లుక్‌లో కనిపించారు. సిక్కు తలపాగా ధరించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సిక్కులకు తగిన గౌరవం దక్కేలా చూస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో మళ్లీ కొత్తగా కులగణన.. సిద్ధరామయ్య ప్రకటన
మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన
For More National News and Telugu News