Vizag Colony Trip: స్వాతంత్ర దినోత్సవం లాంగ్ వీకెండ్..ఈ మినీ గోవాకు వెళ్లి ఆస్వాదించండి..
ABN , Publish Date - Aug 14 , 2025 | 09:17 AM
ఈసారి స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం కారణంగా ఆగస్టు 15 నుంచి 17 వరకు 3 రోజుల వీకెండ్ సెలవులు వచ్చాయి. టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లాలని చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. అయితే హైదరాబాద్ పరిధిలో ఉండే ఓ చక్కటి ప్లేస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈసారి స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం వీకెండ్ వచ్చింది. దీంతో ఆగస్టు 15 నుంచి 17 వరకు మూడు రోజులు ఐటీ సహా పలు కంపెనీలకు సెలవులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఏదైనా టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్నారా. అందుకోసం హైదరాబాద్ నుంచి కొన్ని గంటల దూరంలోనే విజాగ్ కాలనీ (Vizag Colony Trip) అనే చక్కటి ప్లేస్ ఉంది. ఇక్కడ సీక్రెట్ ఐలాండ్ అడ్వెంచర్‌తో సహా బ్యాక్‌వాటర్, గ్రామీణ జీవనం సహా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్థానిక ఆతిథ్యాన్ని అనుభవించాలని లేదా ఒక బోట్ రైడ్‌తో సాహసం చేయాలని అనుకుంటున్న వారికి విజాగ్ కాలనీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
తెలంగాణలో మినీ గోవా
నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో ఇది ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్‌వాటర్స్‌లో దాగి ఉన్న చిన్న గ్రామం విజాగ్ కాలనీ. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం, విశాఖపట్నం నుంచి వచ్చిన 24 కుటుంబాలు డ్యామ్ నిర్మాణం కోసం ఇక్కడ స్థిరపడ్డాయి. ఇప్పుడు, దాదాపు 700 మంది నివాసితులతో, ఈ గ్రామం చుట్టూ ఉన్న ఆకుపచ్చని కొండలు, పొలాలు, ప్రశాంతమైన వీక్షణలతో ఒక అద్భుతమైన రిట్రీట్‌గా మారింది.
ఇక్కడ యెల్లేశ్వరగట్టు ఐలాండ్‌కు ఒక చిన్న బోట్ రైడ్‌తో చేరుకోవచ్చు. ఈ చిన్న ద్వీపం, గ్రామీణ ఆకర్షణ, నీటి దృశ్యాలు, స్థానిక సంస్కృతితో మంచి అనుభవాన్ని అందిస్తుంది. దీనిని తెలంగాణలో మినీ గోవా అని పిలుస్తున్నారు. ఇక్కడి ప్రశాంతత మీమ్మల్ని నగర జీవనం నుంచి పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
ఇక్కడ ఏం చేయవచ్చు?
ఒక చిన్న 20 నిమిషాల బోట్ రైడ్‌తో గ్రీన్ ఐలాండ్‌కు చేరుకోవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.200 ఖర్చుతో ఈ రైడ్ మీకు బ్యాక్‌వాటర్స్ మధ్యలో ఒక మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ సాహసం కోరుకుంటే, స్థానిక చేపల వేటగాళ్లతో రూ.1500కి ఓవర్‌నైట్ క్యాంపింగ్ కూడా చేయవచ్చు. నీటి మధ్యలో నక్షత్రాల రాత్రిలో రొమాంటిక్‌గా గడపవచ్చు.
బ్యాక్‌వాటర్ వీక్షణలు
సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం నీటిపై పడి బంగారు రంగులను విరజిమ్ముతుంది. ఒక కప్పు చాయ్‌తో ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ, నగరంలో ఎన్నడూ దొరకని వీక్షణాన్ని ఆస్వాదించవచ్చు. స్థానికంగా వండిన చేపల వంటకాలను రుచి చూసి స్థానికుల ఆతిథ్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది బెస్ట్ బ్లేస్. రస్టిక్ బోట్లు, గ్రీనరీ దృశ్యాలు, వివిధ రకాల పక్షులు మీ కెమెరాకు పోజులిస్తాయి.
ఎలా చేరుకోవాలి?
విజాగ్ కాలనీకి చేరుకోవడం కూడా ఒక చిన్న అడ్వెంచర్ లాంటిది. హైదరాబాద్ నుంచి NH 65 మీదుగా నార్కెట్‌పల్లి ద్వారా చందంపేట మండలం వరకు ప్రయాణించాలి. అక్కడి నుంచి బ్యాక్‌వాటర్స్ ప్రాంతానికి చేరుకోవచ్చు. కాబట్టి నావిగేషన్ యాప్‌ను ఉపయోగించడంతోపాటు స్థానికులను దారి అడగడం మంచిది. సొంత వాహనంలో వెళితే, రోడ్ ట్రిప్ ఆనందాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించవచ్చు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి