Share News

No US Visa for Fact Checkers: హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత కఠినం.. వారికి కష్టమేనా.?

ABN , Publish Date - Dec 08 , 2025 | 05:09 PM

హెచ్-1బీ వీసాల విషయంలో నిబంధనల్ని కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం మరోసారి చర్యలు చేపట్టింది. ఆ దేశ పౌరుల వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. కంటెంట్ మోడరేటర్లు, ఫ్యాక్ట్ చెకర్ల వంటి వీసా దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాలని, సెన్సార్ అనుమానమున్న దరఖాస్తులను తిరస్కరించాలని అక్కడి రాయబార కార్యాలయ అధికారులకు మెమో జారీచేసింది.

No US Visa for Fact Checkers: హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత కఠినం.. వారికి కష్టమేనా.?
US Visa Denial for Content Moderators

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(America) ప్రభుత్వం హెచ్-1బీ(H-1B Visa) వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పౌరుల వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కంటెంట్ మోడరేటర్లు(Content Moderators), విదేశీ వాస్తవ తనిఖీదారుల(ఫ్యాక్ట్ చెకర్లు)కు వీసా నిరాకరించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సెన్సార్‌షిప్‌(Sensorship)నకు బాధ్యత వహించే లేదా అందులో భాగస్వామిగా ఉన్న ఏ దరఖాస్తుదారునైనా వీసాకు నిరాకరించాలని అక్కడి కాన్సులర్ అధికారులకు మెమో ద్వారా ఆదేశాలు జారీచేసింది. జర్నలిస్టులు, పర్యాటకులతో సహా అన్నిరకాల వీసాలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అయితే.. హెచ్-1బీ వీసాదారులపై ఇది ప్రధానంగా దృష్టి సారించనుండగా.. టెకీలు, ముఖ్యంగా భారత్(India) వంటి దేశాల నుంచి దరఖాస్తు చేసుకునేవారిపై అధిక ప్రభావం చూపనుంది.


కారణమిదే..

వాషింగ్టన్ డీసీలో 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ భవనం అల్లర్ల(Capital riot) తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్(US President Donald Trump) ట్విటర్, ఫేస్‌బుక్ అకౌంట్లపై నిషేధం పడింది. ఇతర అమెరికన్ల ఖాతాలు ఈ రకమైన దుర్వినియోగానికి గురికాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని అక్కడి విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. విదేశీయులు కంటెంట్ నియంత్రణను పర్యవేక్షించడాన్ని అనుమతిస్తే.. అది యూఎస్ ప్రజలను అవమానించినట్టు, అగౌరవపరచినట్లే అవుతుందని ఆయన అన్నారు.


రుజువైతే తిరస్కరణే..

యూఎస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. కంటెంట్ మోడరేటర్లు, వాస్తవ తనిఖీ-సమ్మతి(Fact Checkers), ఆన్‌లైన్ భద్రత(Online Security) వంటి కార్యకలాపాల్లో గతంలో లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై అధిక ప్రభావం చూపనుంది. అలాంటి వారి వీసా దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని మెమో స్పష్టం చేస్తోంది. దరఖాస్తదారుల వర్క్ ఎక్స్‌పీరియన్స్, లింక్డ్ఇన్(LinkedIn) ప్రొఫైల్స్, పబ్లిక్ సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఎవరైనా దరఖాస్తుదారు.. అలాంటి సెన్సార్‌షిప్ కార్యకలాపాల్లో నిమగ్నమైనట్టు తేలితే.. వారి వీసాలను తిరస్కరించాలని మెమోలో పేర్కొంది.

ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో.. ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు, వాస్తవ తనిఖీ కార్యక్రమాలు, నియంత్రణ సంస్థలు, ఎన్జీఓలలో పనిచేస్తున్న వేలాది మంది నిపుణులను ప్రభావితం చేస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇవీ చదవండి:

దౌత్య బ్యాలెన్సింగ్‌లో భారత్‌!

పాకిస్థాన్ ఆర్మీపై జైశంకర్ విమర్శలు.. పాక్ యంత్రాంగం ఆగ్రహం..

Updated Date - Dec 08 , 2025 | 05:52 PM