Share News

India Diplomacy: దౌత్య బ్యాలెన్సింగ్‌లో భారత్‌!

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:41 AM

దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా యుద్ధభూమిలో కొట్లాడుకుంటున్న రష్యా, ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌ దౌత్యపరంగా సమతుల్య చర్యలు తీసుకుంటోంది....

India Diplomacy: దౌత్య బ్యాలెన్సింగ్‌లో భారత్‌!

  • జనవరిలో భారత పర్యటనకు జెలెన్‌స్కీ?.. ఇటీవలే పుతిన్‌ పర్యటన పూర్తి

న్యూఢిల్లీ, డిసెంబరు 7: దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా యుద్ధభూమిలో కొట్లాడుకుంటున్న రష్యా, ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌ దౌత్యపరంగా సమతుల్య చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా రెండు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చి వెళ్లారు. పుతిన్‌ శత్రు దేశమైన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా త్వరలో మన దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి జెలెన్‌స్కీ పర్యటన ఉండే అవకాశం ఉందని జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై భారత్‌, ఉక్రెయిన్‌ అధికారుల మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయని, పుతిన్‌ భారత్‌ పర్యటనకు రాకముందు నుంచే కేంద్ర ప్రభుత్వం జెలెన్‌స్కీ కార్యాలయంతో సంప్రదింపులు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. యుద్ధంలో ఉన్న రష్యా, ఉక్రెయిన్‌ పక్షాలతోనూ సన్నిహితంగా ఉండేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లగా, ఆ తర్వాతి నెలలోనే ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి వచ్చారు. 2022 ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్‌ రెండు దేశాలతోనూ టచ్‌లో ఉంది. భారత్‌ తటస్థంగా లేదని, శాంతి వైపు ఉంటుందని చెబుతూ వస్తోంది. జెలెన్‌స్కీతో మోదీ ఇప్పటికే దాదాపు 8సార్లు ఫోన్‌లో మాట్లాడారు. 4సందర్భాల్లో ఇద్దరూ నేతలు వ్యక్తిగతంగానూ కలిశారు.

Updated Date - Dec 08 , 2025 | 03:41 AM