Trump In Egypt: భారత్, పాక్‌లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:25 AM
ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. అలాగే భారత్, పాకిస్థాన్‌లు కలిసి మెలిసి చక్కగా జీవిస్తాయని భావిస్తున్నానన్నారు.
షర్మ్ ఎల్-షేక్, అక్టోబర్ 14: ఇరుగు పొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్‌లు కలిసి మెలిసి జీవిస్తాయని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈజిప్టు వేదికగా పాలస్తీనా, హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వేళ.. వివిధ దేశాధినేతలు ఈజిప్టు తరలి వచ్చారు. ఈ ఒప్పందంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
భారతదేశం గొప్ప దేశమన్నారు. ఆ దేశంలో అత్యున్నత స్థాయిలో తనకు గొప్ప స్నేహితుడు ఉన్నారని తెలిపారు. ఆయన తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారంటూ ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఎక్కడా ప్రధాని మోదీ పేరు మాత్రం ట్రంప్ ప్రస్తావించక పోవడం గమనార్హం.
అయితే భారత్, పాక్ కలిసి మెలిసి చక్కగా జీవిస్తాయంటూ తన పక్కనే ఉన్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌ను చూస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని నవ్వారు. అంతకు ముందు పాకిస్థాన్ ప్రధానితోపాటు ఆ దేశ ఆర్మీ చీఫ్‌లను సైతం ట్రంప్ ప్రశంసించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ట్రంప్‌పై పొగడ్తలు కురిపించారు. ట్రంప్ చేసిన అవిశ్రాంత కృషి వల్లే మద్య ప్రాచ్యంలో శాంతి నెలకొందన్నారు. దక్షిణాసియాలోనే కాకుండా మధ్య ప్రాచ్యంలో కూడా లక్షలాది మంది ప్రాణాలను ట్రంప్ కాపాడారని పేర్కొన్నారు. అందుకే ఆయన పేరును మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలనుకొంటున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. వీటితోపాటు ప్రపంచంలోనే పలు యుద్ధాలను తాను ఆపానంటూ పలు సందర్భాల్లో వివిధ వేదికల నుంచి ట్రంప్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందని ఆయన భావించారు.
కానీ ఈ ఏడాది ఆ బహుమతికి వెనెజువెలా ప్రతిపక్ష నేత, హక్కుల కార్యకర్త మరియా కొరినా మడోచ్ ఎంపికయ్యారు. దాంతో ట్రంప్ ఆశలపై నీళ్లు పోసినట్లు అయింది. మరోవైపు ఈ బహుమతి ట్రంప్‌కు రాకపోవడంపై వైట్ హౌస్ సైతం కాస్తా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి నుంచి ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం
కొత్తగా హెచ్-1బీ ఉద్యోగులను నియమించం: టీసీఎస్ సీఈవో కృతివాసన్
For More International News And Telugu News