Share News

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

ABN , Publish Date - Dec 23 , 2025 | 07:22 AM

ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట
Trump Nuclear War Claim

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో తన పాత్ర గురించి మరోసారి చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ డీసీలో డిసెంబర్ 22(స్థానిక సమయం) మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో 8 విమానాలు కూల్చివేయబడ్డాయని, అది అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందని, తాను ట్రేడ్ టారిఫ్‌ల బెదిరింపుతో 24 గంటల్లోనే దాన్ని ఆపానని ట్రంప్ పునరుద్ఘాటించారు.


పహల్‌గామ్ ఉగ్రదాడి (26 మంది మరణం) తర్వాత మే నెలలో భారత్.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఇరు దేశాల మధ్య వైమానిక, క్షిపణి దాడులు జరిగాయని ట్రంప్ చెప్పారు. 'పాకిస్తాన్ ప్రధాని నాకు ధన్యవాదాలు చెప్పారు. ట్రంప్ 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించారని అన్నారు' అని ట్రంప్ పేర్కొన్నారు.

తాను మొత్తం 8 యుద్ధాలు ఆపానని, రష్యా-ఉక్రెయిన్ మినహా మిగతావన్నీ పరిష్కరించానని కూడా ట్రంప్ అన్నారు. అయితే, ఈ క్లెయిమ్‌లు కొత్త కావు. 2025 మే నుంచి ట్రంప్ ఇలాంటి ప్రకటనలు డజన్ల కొద్దీ చేశారు. ముందు 5 విమానాలు, తర్వాత 7, ఇప్పుడు 8 అని సంఖ్యను మారుస్తూ వస్తున్నారు.


భారత్ మాత్రం ఈ క్లెయిమ్‌లను పదేపదే తిరస్కరిస్తోంది. సీజ్‌ఫైర్ ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమని, అమెరికా లేదా మూడవ పక్షం జోక్యం ఏమీ లేదని భారత్ స్పష్టం చేసింది.

పాకిస్తాన్ మాత్రం ట్రంప్ పాత్రను కొనియాడుతూ వచ్చింది. ఒకసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కూడా చేసింది. ఈ వివాదం భారత్-అమెరికా సంబంధాల్లో ఒక చిన్న గీతను కూడా ఏర్పరచింది. ట్రంప్ ట్రేడ్ బెదిరింపులతో యుద్ధాలు ఆపుతాననే ధోరణి, కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం ఆఫర్ చేయడం భారత్‌కు ఇష్టం లేని విషయాలు.

అయినా, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ట్రంప్ ఈ క్లెయిమ్‌లతో తన దౌత్యవిజయాలను హైలైట్ చేస్తున్నారు, కానీ వాస్తవాలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి.


ఇవీ చదవండి:

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 23 , 2025 | 07:22 AM