Share News

Donald Trump: ..ఇంకా ఉంది!

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:16 AM

రష్యా చమురు కొనుగోలు చేయవద్దన్న తన మాట వినడం లేదంటూ భారత్‌పై ఒంటికాలిపై లేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మున్ముందు ఇంకా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: ..ఇంకా ఉంది!

సుంకాలు అమల్లోకి వచ్చి కొన్ని గంటలే అయింది

  • చైనా సహా మరిన్ని దేశాలపైనా ‘రష్యా చమురు’ టారి్‌ఫలు

  • భారత్‌పై సుంకాలు పెంచాం..

  • రష్యాతో చర్చల్లో పురోగతి వచ్చింది

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు

  • వచ్చే వారం ట్రంప్‌-పుతిన్‌ భేటీ?

  • ఈ ఏడాది చివర్లో భారత్‌కు పుతిన్‌

  • మా రైతుల ప్రయోజనాలపై రాజీలేదు

  • అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంశంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ

వాషింగ్టన్‌/మాస్కో/న్యూఢిల్లీ, ఆగస్టు 7: రష్యా చమురు కొనుగోలు చేయవద్దన్న తన మాట వినడం లేదంటూ భారత్‌పై ఒంటికాలిపై లేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మున్ముందు ఇంకా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచామని.. ఇదే సమయంలో ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంలో రష్యాతో చర్చల్లో పురోగతి నెలకొందని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌పై విధించిన ఆంక్షలు ప్రభావం చూపిస్తున్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్‌లతో సంధి ఒప్పందం కుదిరితే భారత్‌పై వేసిన అదనపు సుంకాలను తగ్గిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘దాని గురించి తర్వాత ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే భారత్‌ 50శాతం సుంకాలు చెల్లిస్తోంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. రష్యా నుంచి చైనాతోపాటు ఇతర దేశాలు కూడా చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘టారి్‌ఫలు అమల్లోకి వచ్చి కొన్ని గంటలే అయింది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో చైనాకు భారత్‌ చాలా దగ్గరగా ఉంది. ఇంకా మున్ముందు చాలా చూడాల్సి ఉంది. చైనా సహా మరికొన్ని దేశాలపైనా సుంకాలు విధించే అవకాశం ఉంది. ఇప్పటికైతే కచ్చితంగా చెప్పలేం..’’ అని పేర్కొన్నారు. కాగా, యాపిల్‌ కంపెనీ అమెరికాలో వచ్చే నాలుగేళ్లలో మరో వంద బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8.7 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే నిర్ణయించిన 500 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.43.5లక్షల కోట్లు) పెట్టుబడులకు ఇది అదనం. యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో వైట్‌హౌజ్‌లో భేటీ అయిన తర్వాత ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్లు అమెరికాలోనే తయారుకావాలన్న లక్ష్యం దిశగా ఇదొక ముం దడుగు అన్నారు. అమెరికాకు దిగుమత య్యే కంప్యూటర్‌ చిప్‌లు, సెమీకండక్టర్లపై 100ు దిగుమతి సుంకం విధించనున్నట్టు ట్రంప్‌ తెలిపారు.


ఇంటెల్‌ సీఈవో రాజీనామా చేయాలి..

ప్రఖ్యాత చిప్‌లు, సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఇంటెల్‌ సీఈవో లిప్‌-బు టాన్‌ రాజీనామా చేయాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. ‘‘తీవ్రంగా వివాదాస్పదంగా మారిన ఇంటెల్‌ సీఈవో వెంటనే రాజీనామా చేయాలి. ఈ సమస్యకు మరో పరిష్కారం లేదు’’ అని ట్రంప్‌ ‘ట్రుత్‌ సోషల్‌’ వేదికపై వ్యాఖ్యానించారు. చైనా కంపెనీలతో లిప్‌ బు టాన్‌ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని, ఇది ఇంటెల్‌కు, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదకరమని ఇటీవలే అమెరికా సెనేటర్‌ కాటన్‌ ఆరోపించారు. సీఈవోను తొలగించాలంటూ ఇంటెల్‌కు లేఖ రాశారు. కాగా భారత్‌పై ఏకపక్షంగా అమెరికా విధిస్తున్న సుంకాలకు బదులుగా భారత్‌ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు.


పుతిన్‌తో అజిత్‌ దోవల్‌ భేటీ..

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ గురువారం రష్యాలోని మాస్కోలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇంధనం, రక్షణ బంధాలపై చర్చించారు. అంతకుముందు రష్యా భద్రతామండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతోనూ దోవల్‌ భేటీఅయ్యారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి, అదనపు సుంకాల నేపథ్యంలో దోవల్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈ ఏడాది చివరిలో పుతిన్‌ భారత్‌లో పర్యటించనున్నట్టు సమాచారం. ఇక ఉక్రెయిన్‌తో యుద్ధం నిలిపివేత, రష్యాపై ఆంక్షల తొలగింపు అంశాలపై అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్‌, పుతిన్‌ భేటీ కానున్నారు. మాస్కోలో పుతిన్‌తో అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ చర్చల సందర్భంగా దీనిపై అంగీకారం కుదిరింది. వచ్చే వారంలోనే యూఏఈ లో ట్రంప్‌తో భేటీ జరగవచ్చని పుతిన్‌ పేర్కొన్నారు.


ట్రంప్‌ సుంకాలతో రూ.12 వేల కోట్ల నష్టం తిరుప్పూర్‌ వస్త్ర ఎగుమతిదారుల సంఘం

చెన్నై, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బాదిన సుంకాల కారణంగా వస్త్ర ఎగుమతులు నిలిచిపోయి, తక్షణం రూ.12వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశముందని తమిళనాడులోని తిరుప్పూరు వస్త్ర ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన తిరుప్పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు అసమంజసంగా ఉన్నాయని, పెంపు ద్వారా వినియోగదారులే తీవ్రంగా నష్టపోతారన్నారు. తిరుప్పూరులో రూ.100కు లభించే దుస్తుల ధర రూ.150కు పెరుగుతుందని ఉదహరించారు. అమెరికా సుంకాల కారణంగా తిరుప్పూరు దుస్తుల ఎగుమతి కేంద్రాల్లో పనిచేస్తున్నవారి ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. బ్రిటన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా ఆ దేశానికే దుస్తులను అధికంగా ఎగుమతి చేస్తామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్

For More National News and Telugu News

Updated Date - Aug 08 , 2025 | 05:16 AM