Trump: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగడానికి భారత్, చైనాలే కారణం.. ట్రంప్ అక్కసు
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:41 PM
ఏడాది క్రితం అమెరికా తీవ్ర చిక్కుల్లో ఉందనీ, తన హయాంలో కేవలం ఎనిమిది నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, ఇది తమదేశానికి స్వర్ణయుగమని ట్రంప్ అన్నారు. ఏ దేశం కూడా తమ దరిదాపుల్లోకి కూడా రాలేవన్నారు.
న్యూయార్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపునకు భారత్-చైనాలు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అక్కసు వెళ్లగక్కారు. చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ రష్యాకు సహాయం చేస్తున్నాయని విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించడంలో ఐరోపా, నాటో దేశాలు సైతం విఫలమయ్యాయని ఆక్షేపణ తెలిపారు. మంగళవారంనాడు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని (UNGA) ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగించడం ద్వారా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి ప్రధాన ఫండర్స్‌గా భారత్, చైనా ఉన్నాయి. నాటో దేశాలు కూడా రష్యా ఇంధన, ఇంధన ఉత్పత్తులు తగ్గించుకోలేదని రెండు వారాల క్రితం గుర్తించాను. ఈ పరిణామాలతోనే యుద్ధానికి ముగింపు పలకే డీల్‌కు రష్యా దూరంగా ఉంటోంది. శక్తివంతమైన సుంకాలు విధింపుతో రక్తపాతాన్ని ఆపేందుకు అమెరికా గట్టిగా ప్రయత్నిస్తోంది. అతి త్వరలోనే పెంచిన సుంకాలు చాలా తీవ్రప్రభావం చూపుతాయనే నమ్మకం నాకుంది. ఇదే తరహా చర్యలు తీసుకుంటామని సమావేశానికి హాజరైన యూరోపియన్ దేశాలన్నీ మాతో చేతులు కలపాలి' అని ట్రంప్ కోరారు.
ఏడాది క్రితం అమెరికా తీవ్ర చిక్కుల్లో ఉందనీ, తన హయాంలో కేవలం ఎనిమిది నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, ఇది తమదేశానికి స్వర్ణయుగమని అన్నారు. ఏ దేశం కూడా తమ దరిదాపుల్లోకి కూడా రాలేదని అన్నారు. దేశం ఆర్థికంగా పటిష్టంగా ఉందని, సరిహద్దులు పటిష్టం చేసామని, మిలటరీ, మైత్రీసంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని చెప్పారు. భారత్-పాకిస్థాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు నెలల్లో ఏడు నెలలు యుద్ధాలు ఆపానని ప్రకటించుకున్నారు.
ఇవి కూాడా చదవండి..
ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపా: ట్రంప్
టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహ ఏర్పాటుపై సెనేటర్ తీవ్ర వ్యాఖ్యలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి