Shehbaz Sharif: కశ్మీర్‌పై మళ్లీ విషం కక్కిన షెహబాజ్
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:41 PM
కశ్మీర్ అంశం పరిష్కారమయ్యేంత వరకూ ఇరుదేశాల సంబంధాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడం సాధ్యం కాదనీ, కశ్మీర్ ప్రజల రక్తం వృథా కారాదని షెహబాజ్ అన్నారు. కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా ఇరుదేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొల్పవచ్చని ఎవరైనా నమ్మితే వాళ్లు 'ఫూల్స్ ప్యారడైజ్'లో విహరిస్తున్నట్టేనని పేర్కొన్నారు.
లండన్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shebaz Sharif) మరోసారి కశ్మీర్ (Kashmir) అంశంపై విషం కక్కారు. కశ్మీర్ సమస్య పరిష్కారమైతేనే భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని అన్నారు. కశ్మీర్ సమస్యను గాజాలో పరిస్థితితో పోల్చే ప్రయత్నం చేశారు. లండన్‌లో ఓవర్సీస్ పాకిస్థాన్ కమ్యూనిటీని ఉద్దేశించి షెహబాజ్ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరుప్రాంతాల్లో శాంతి స్థాపనకు భారత్ చొరవ చూపాల్సి ఉంటుందని అన్నారు.
'భారత్, పాక్ ఇరుగుపొరుగు దేశాలు. కలిసి మెలిసి జీవనం సాగించాల్సి ఉంటుంది. అయితే కశ్మీర్ అంశం పరిష్కారమయ్యేంత వరకూ ఇరుదేశాల సంబంధాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడం సాధ్యం కాదు. కశ్మీర్ ప్రజల రక్తం వృథా కారాదు' అని షెహబాజ్ అన్నారు. కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా ఇరుదేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొల్పవచ్చని ఎవరైనా నమ్మితే వాళ్లు 'ఫూల్స్ ప్యారడైజ్'లో విహరిస్తున్నట్టేనని పేర్కొన్నారు.
నాలుగు యుద్ధాలు చేశాం..
కశ్మీర్ సమస్యపై నాలుగు యుద్ధాలు చేశామని, ఇందుకోసం లక్షలాది డాలర్లు ధారపోసామని, ఆ నిధులను పాకిస్థాన్ ప్రజల అభివృద్ధి, అభ్యున్నతికి ఉపయోగించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. పొరుగుదేశానికి సహకరించడానికి బదులు పోరాట వైఖరినే ఇండియా ప్రదర్శిస్తోందని తప్పుపట్టారు. 'ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. మనం శాంతిగా జీవనం సాగించాలా, పోరాటం కొనసాగించాలా?. అయితే పరస్పర ప్రేమ, పరస్పర గౌరవంతో జీవించాలన్నదే మన అభిమతం' అని షెహబాజ్ అన్నారు.
కశ్మీర్ అంశంపై మాట్లాడుతూనే గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని షెహబాజ్ ప్రస్తావించారు. 'గాజాలో 64,000 మంది ప్రజలు ప్రాణత్యాగాలు చేశారు. వారికి ఆహారం, నిత్యావసరాలు నిలిచిపోయాయి. కనీసం బతుకుతెరువు కోసం సంపాదించుకునే వీలు కూడా వారికి లేదు' అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
హెచ్-1బీ వీసాదారులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ భారీ ఆపరేషన్
హెచ్-1బీ వీసా పెంపును సమర్థించుకున్న అమెరికా.. వాస్తవాలు ఇవిగో అంటూ ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి