Trump Tactics : ఎందుకు ట్రంప్‌కు భారత్‌పై ద్వేషం, చైనాపై ప్రేమ
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:36 PM
డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న భారత్ వ్యతిరేక చేష్టలు తారాస్థాయికి చేరుతున్నాయి. తనకు తాను 'శాంతి దూత'గా పదే పదే చెప్పుకుంటున్న ట్రంప్.. ఇప్పుడు భారత్ పై విషం కక్కుతూ, మన దాయాది దేశాలైన చైనా, పాకిస్థాన్ లపై విపరీతమైన ప్రేమ ఒలకబోస్తూ ఆయా దేశాల్ని దువ్వుతున్నారు.
Donald Trump - India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న భారత్ వ్యతిరేక చేష్టలు తారాస్థాయికి చేరుతున్నాయి. తనకు తాను 'శాంతి దూత'గా పదే పదే చెప్పుకుంటున్న ట్రంప్.. ఇప్పుడు భారత్ పై విషం కక్కుతూ, మన దాయాది దేశాలైన చైనా, పాకిస్థాన్ లపై విపరీతమైన ప్రేమ ఒలకబోస్తూ ఆయా దేశాల్ని దువ్వుతున్నారు. ఇటీవల ప్రపంచ దేశాలపై పెద్ద ఎత్తున ట్రేడ్ టారిఫ్స్ విధించిన అమెరికా అధ్యక్షుడు.. చైనా దగ్గర తన పప్పులు ఉడక్కపోవడంతో చచ్చినట్టు ఆదేశంతో కాళ్ల బేరానికి దిగారు. ఇప్పుడు మరింత దిగజారి చైనాపై టారిఫ్స్ తగ్గిస్తూ, భారత్ మీద భారీగా సుంకాలు, జరిమానాలు పెంచుతూ కొత్త డ్రామాకు తెరతీస్తున్నారు.
భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అనేక సార్లు ప్రకటించుకున్నారు డోనాల్డ్ ట్రంప్. అయితే, భారత్ దీనిని ఖండించడంతో.. మాట మార్చి తన పాత్రేమీ లేదంటూ ఒకటి రెండు సార్లు వివరణ ఇచ్చారు. అయితే, మళ్లీ పాత పాటే పాడుతూ తన వల్లే యుద్ధం ఆగిందంటూ చాలా మార్లు ప్రకటించారు. అయితే, ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేసిన ఘనతను ఎప్పుడూ డోనాల్డ్ ట్రంప్ కు ఇవ్వలేదు భారత్. ఇది ట్రంప్ ఆగ్రహానికి ఒక కారణంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక, తక్షణ కారణంగా రష్యాతో భారత్ నెరుపుతున్న వాణిజ్య సంబంధాల్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను ఆపాలని ట్రంప్ ఆదేశిస్తున్నారు. భారత్ ఇస్తున్న డబ్బుతోనే రష్యా.. ఉక్రెయిన్ తో యుద్ధం చేయగలుగుతోందంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీని వల్లే భారత్ మీద 50 శాతం సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు.
భారత్ ను ఆడిపోసుకుంటూ.. ఇదే సమయంలో చైనాపైన సుంకాలు తగ్గిస్తున్నట్టు రోజుకో రకమైన ప్రకటనలు చేస్తూ ఇప్పుడు చైనా ప్రేమకోసం ఉవ్వుళ్లూరుతున్నారు ట్రంప్. మరోవైపు, 'అమెరికా ఫస్ట్' విధానాన్ని హైలైట్ చేస్తూ.. భారతదేశం.. అమెరికా మీద ఎక్కువ సుంకాలు (52% వరకు) విధిస్తోందని, ఇది అమెరికాకు నష్టం కలిగిస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా BRICS - డాలర్ ఆధిపత్యం. భారత్, రష్యా, చైనాలు BRICS దేశాలలో భాగంగా స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని పెంచడం.. డాలర్ ఆధిపత్యానికి ముప్పుగా ట్రంప్ భావిస్తున్నారు. ఈ విధానం అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు.
దీంతోపాటు, భారత్ - చైనా మధ్య మెరుగవుతున్న దౌత్య సంబంధాలు కూడా ట్రంప్ కు కంటగింపుగా మారాయి. మరోవైపు, మోదీ చైనా పర్యటన అమెరికాకు సవాలుగా మారింది. ఎందుకంటే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా భావిస్తుంది. అందుకే ఇప్పుడు ప్లేటు మార్చి.. చైనా గురించి 'నేను చైనా ప్రజలను ప్రేమిస్తాను' వంటి కొత్త మాటలు మాట్లాడుతున్నారు ట్రంప్. పనిలో పనిగా పాకిస్థాన్ తో విపరీతమైన స్నేహం నెరుపుతూ భారత్ ను ఇరుకున పెట్టే తంత్రాలకు సైతం దిగుతున్నారు ట్రంప్.
ఇవి కూడా చదవండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి