Pakistan Army Chief: పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీపై రూమర్లు అబద్ధం అన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:47 AM
పాకిస్తాన్ ఇటీవలి కాలంలో అనేక విషయాల్లో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని పదవి నుంచి తప్పించబోతున్నారనే పుకార్లు నెట్టింట ఊపందుకున్నాయి. వీటిపై ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ క్లారిటీ ఇచ్చారు.
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని పదవి నుంచి తొలగించబోతున్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అదే సమయంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Asim Munir) బాధ్యతలు చేపట్టనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అబద్ధాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో కావాలనే ఇలా చేయిస్తున్నారని పేర్కొన్నారు.
రక్షించే బాధ్యత..
బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ సమావేశంలో మునీర్ ఈ అంశంపై ప్రస్తావించారు. అధ్యక్షుడు లేదా ప్రధాని పదవుల మార్పు జరగబోదని, అలాంటి ప్రయత్నాలే లేవన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమేనని మునీర్ స్పష్టం చేశారు. అంతేకాదు దేవుడు నాకు దేశాన్ని రక్షించే బాధ్యత ఇచ్చాడని, నాకేం పదవుల కోరిక లేదన్నారు. రాజకీయ సహకారం రావాలంటే, ముందు నిజమైన క్షమాపణ అవసరమని మునీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇద్దరు మిత్రులు
ఇక్కడ మునీర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో క్లియర్‌గా చెప్పకపోయినా, రాజకీయ వర్గాలు ప్రకారం ఆయన వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) గురించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా-చైనా సంబంధాల విషయంలో మునీర్ బలంగా ఓ స్టాండ్ తీసుకున్నారు. మనకు ఇద్దరు మంచి మిత్రులు ఉన్నప్పుడు ఒకరిని వదులుకుని ఇంకొకరిని పట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రస్తావించారు.
నామినేట్ చేసిన మొదటి దేశం పాకిస్తాన్
ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన మొదటి దేశం పాకిస్తానేనని మునీర్ ప్రస్తావించడం. తర్వాతే ఇతర దేశాలు కూడా నామినేట్ చేశాయట.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి