Share News

Viral Video: ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్‌, జర్నలిస్టులపై పాక్ పోలీసుల దాడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 03 , 2025 | 06:18 PM

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లో ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్‌ నేషనల్ ప్రెస్ క్లబ్ (NPC)పై జరిగిన పోలీసుల దాడి చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో, పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్‌, జర్నలిస్టులపై పాక్ పోలీసుల దాడి.. వీడియో వైరల్
Pak Police Raid Islamabad Press Club

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లో జరుగుతున్న అణచివేతలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌ల మధ్య ఇస్లామాబాద్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్ (NPC)పై పోలీసులు దాడి చేశారు (Pakistan Police). ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులపై దాడి జరిగింది. కొందరిని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. PoKలో జరుగుతున్న అరాచకాలు, అక్కడి ప్రజల ఆందోళన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైలుగులోకి వచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


మరో చిత్రంలో

ఇస్లామాబాద్‌లో ఉన్న నేషనల్ ప్రెస్ క్లబ్‌పై గురువారం నాడు పోలీసులు దాడి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో పోలీసులు లాఠీలతో ప్రెస్ క్లబ్ క్యాంటీన్‌లోకి ప్రవేశించి, అక్కడ కూర్చున్న వారిపై దాడి చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిలో కొందరు జర్నలిస్టులను బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లారు. ఒక వైరల్ ఫొటోలో చేతిలో కెమెరాను పట్టుకున్న జర్నలిస్టు కాలర్ పోలీస్ పట్టుకోగా అతను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.


ఈ దాడికి కారణం ఏంటి?

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పిలుపునిచ్చిన నిరసనలను కవర్ చేస్తున్న కాశ్మీరీ జర్నలిస్టులను అరెస్టు చేయడానికి పోలీసులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం JAAC సభ్యులను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు జర్నలిస్టులను నిరసనకారులుగా తప్పుగా భావించి దాడి చేశారని సమాచారం. ఈ ఘటనపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని పలువురు జర్నలిస్టులు అన్నారు.


విచారణకు ఆదేశం

JAAC సభ్యులను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు.. క్యాంటీన్‌లో ఉన్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారని ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ తెలిపారు. ఈ దాడి PoKలో నిరసనలు జరుగుతున్న సమయంలో ప్రెస్ క్లబ్ వెలుపల ఆందోళనకారులు ఉన్నప్పుడు జరిగింది. ఈ దాడి పాకిస్థాన్ అంతటా తీవ్ర నిరసనలకు దారితీసింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (HRCP) ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై స్పందించిన పాకిస్థాన్ హోంమంత్రి మొహ్‌సిన్ నఖ్వీ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో పాల్గొన్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 06:45 PM