Share News

Nepal Protests: నేపాల్ నిరసనల్లో 19 మంది మృతి.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం, నిషేధం ఎత్తివేత

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:44 AM

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తీసుకున్న సోషల్ మీడియా నిషేధ నిర్ణయం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇవి కాస్తా హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 347 మందికి పైగా గాయాలయ్యాయి.

Nepal Protests: నేపాల్ నిరసనల్లో 19 మంది మృతి.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం, నిషేధం ఎత్తివేత
Nepal Protests

నేపాల్‌లో ఇటీవలి సోషల్ మీడియా నిషేధం దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తీసుకున్న ఈ నిర్ణయం యువతను రోడ్లపైకి రప్పించింది. సోషల్ మీడియా నిషేధం ప్రకటించిన వెంటనే భారీగా యువత రోడ్లపైకి వచ్చారు. మా గొంతును నొక్కడం సరికాదని వారు నిరసనలు (Nepal Protests) మొదలుపెట్టారు. కాట్మండూ నుంచి దేశమంతా వ్యాపించిన ఈ ఆందోళనలు మొదట శాంతియుతంగా ఉన్నా, తర్వాత హింసాత్మకంగా మారాయి.

ఈ నిరసనల్లో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, 347 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించిన తన ముందు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ తెలిపారు.


పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. కాట్మండూ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూలు విధించారు. ప్రభుత్వం నిరసన కారులపై కఠిన చర్యలు తీసుకుంది. 40 మందికి పైగా యువతను అరెస్టు చేశారు. ఈ చర్యలు మరింత ఆగ్రహాన్ని రెచ్చగొట్టాయి. ప్రజలు, మానవ హక్కుల సంస్థలు ఈ నిషేధాన్ని ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించాయి. ఈ ఘటనల నడుమ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా (Ramesh Lekhak Resignation) చేశారు. ప్రాణ నష్టాలను చూసి నిశ్శబ్దంగా ఉండలేనని ఆయన ప్రకటించారు. ఈ రాజీనామా ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచింది.


ఈ నిషేధం పాలక కూటమిలోనూ విభేదాలను తెచ్చింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ (Nepal Congress) ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై వాదనలు చెలరేగి, కొందరు నాయకులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ గందరగోళం ప్రభుత్వంలో అస్థిరతను సృష్టించింది. ప్రధానమంత్రి ఓలీ ఈ సమస్యను చర్చించడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటివరకు సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది 15 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది.


నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా ఫేస్‌బుక్, X (పాత ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించింది. కారణం? నకిలీ వార్తలు, సైబర్ నేరాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ నిర్ణయం ప్రజల స్వేచ్ఛపై దాడిగా మారిందని యువత ఆరోపిస్తోంది. ఇది క్రమంగా నిరసనల స్థాయి నుంచి హింసాత్మకంగా మారింది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 07:01 AM