Jaish-e-Mohammed chief Masood Azhar: మసూద్ అజార్ మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:16 PM
జైష్ ఏ మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆపరేషన్ సిందూర్‌తో అతడు తీవ్రంగా దెబ్బతిన్నాడు.
ఇస్లామాబాద్, అక్టోబర్ 22: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు జైష్ ఏ మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్ కొలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుంచి కొలుకునేందుకు మసూద్ అజార్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా నిధులు సేకరించే పనిలో అతడు నిమగ్నమయ్యాడు. తాజాగా మహిళల కోసం తుఫత్ అల్ మోమినత్ పేరిట ఆన్ లైన్ కోర్సులు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సుల్లో జిహాదీ, ఇస్లాం బోధించనున్నారట.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మసూద్ అజార్ తన ఇద్దరు సోదరిమణులు.. ప్రతి రోజు 40 నిమిషాల పాటు ఈ ఆన్ లైన్‌లో బోధనలు చేయనున్నారు. తద్వారా జైష్ ఏ మహ్మద్ ఇటీవల ప్రారంభించిన మహిళా విభాగం జమాత్ ఉల్ మోమినత్‌లో చేరేలా మహిళలను వీరు ప్రోత్సహించనున్నారు. ఈ ఆన్ లైన్ కోర్సు కింద 500 పాకిస్థాన్ రూపాయిలు ఒక్కొక్కరి నుంచి వసూలు చేయనున్నారు. (అదే భారత్ కరెన్సీ ప్రకారం..రూ.156.54).
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. వీరిలో 25 మంది పర్యాటకులు కాగా.. ఒక్కరు స్థానికులు. ఈ దాడిపై భారత్ మండిపడింది. అందుకు ప్రతిగా భారత్ మే 7, 8 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ పేరిట.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పలు ఉగ్రవాద సంస్థలు నాశనమయ్యాయి.
అంతేకాదు జైష్ ఏ మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు సైతం ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయారు. ఈ దాడిలో అతడి సోదరి సాదియా భర్త యూసుఫ్ అజార్ సైతం మరణించారు. అయితే ఈ ఆన్ లైన్ కోర్సు బోధించే బాధ్యతను సాదియాకు మసూద్ అప్పగించడం గమనార్హం. అక్టోబర్ 8వ తేదీన అజార్ జమాత్ మహిళా విభాగాన్ని అతడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంటే.. అక్టోబర్ 19న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మహిళల కోసం దుఖ్తరన్ ఏ ఇస్లాం కార్యక్రమాన్ని అతడు చేపట్టాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేగం పెంచిన ఈడీ.. సృష్టి నమ్రతపై ప్రశ్నల వర్షం..
మూడు గంటలపాటు గాలిలో ఎగిరి చివరకు..
For More International News And Telugu News