ED Investigation Srushti Fertility Scam: వేగం పెంచిన ఈడీ.. సృష్టి నమ్రతపై ప్రశ్నల వర్షం..
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:56 PM
పిల్లలు లేని జంటలు, అబార్షన్ చేయించుకునేందుకు వచ్చిన వారినే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమత్రా వ్యవహారాలు నడిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 నుంచి రూ.40 లక్షల వరకూ డాక్టర్ నమత్రా వసూలు చేసినట్లు కనుగొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితులు డాక్టర్ నమ్రత, కల్యాణి, సంతోష్, నందినిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్‌కృష్ణను సైతం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించిన వ్యవహారంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
రాజస్థాన్‌కు చెందిన దంపతులు సికింద్రాబాద్ నార్త్ జోన్‌లోని గోపాలపురం పోలీసులను ఆశ్రయించి.. సృష్టి ఫెర్టిలిటీ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ నమత్రపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సృష్టి ఫెర్టిలిటీ ఆసుపత్రి చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు వ్యవహారం బహిర్గమైంది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
ఈ సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఐదు చోట్ల, విజయవాడ, విశాఖపట్నంలో రెండు చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు బ్యాంక్ అకౌంట్లతోపాటు సృష్టి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు లేని జంటలను లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమత్రా వ్యవహారాలు నడిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 నుంచి రూ.40లక్షల వరకూ డాక్టర్ నమత్రా వసూలు చేసినట్లు గుర్తించారు.
ఇక అబార్షన్ కోసం వచ్చే మహిళలకు నగదు ఆశ చూపి.. వారి వద్ద నుంచి సైతం పిల్లలను కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం 86 మంది పిల్లలను విక్రయించడం ద్వారా.. రూ.50కోట్ల నగదు డాక్టర్ నమత్రా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదును హావాలా రూపంలో సేకరించింది. వీటితో భారీగా ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా.. విదేశాలకు సైతం పెద్దఎత్తున హవాలా రూపంలో నగదు పంపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను డాక్టర్ నమత్ర నుంచి ఈడీ అధికారులు రాబడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News