Saifullla Kasuri: కశ్మీర్‌పై వెనక్కి తగ్గం.. భారత్‌కు పహల్గాం సూత్రధారి సైఫుల్లా కసూరి వార్నింగ్
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:19 PM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పాక్‌లోని ఉగ్రస్థావరాలు నేలమట్టం కావడాన్ని సైఫుల్లా కసూరీ అంగీకరిస్తూనే, భారత్ చాలా పెద్ద తప్పుచేసిందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
లాహోర్: హహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ప్రధాన సూత్రధారి, లష్కరే తొయిబా (LeT) అగ్రనేత సైఫుల్లా కసూరి (Saifullah Kasuri) మరోసారి భారత్‌పై విషం కక్కాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)లో పాక్‌లోని ఉగ్రస్థావరాలు నేలమట్టం కావడాన్ని అంగీకరిస్తూనే, భారత్ చాలా పెద్ద తప్పుచేసిందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ మిషన్‌పై తమ గ్రూప్ వెనక్కి తగ్గేది లేదని పునరుద్ఘాటించాడు. హఫీజ్ సయూద్ సారథ్యంలోని లష్కరే గ్రూప్‌కు డిప్యూటీ చీఫ్‌గా సైఫుల్లా కసూరి ఉన్నాడు. లష్కరే కార్యకర్తలు, సానుభూతిపరులతో జరిగిన ఒక సమావేశంలో సైఫుల్లా ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఆపరేషన్ సిందూర్‌లో కేవలం ఉగ్రశిబిరాలను మాత్రమే టార్గెట్ చేసి భారత్ చాలా పెద్ద తప్పు చేసింది' అని సైఫుల్లా చెప్పినట్టు ఒక వీడియోలో కనిపిస్తోంది. 'మీ సొంత ప్రజలు, బయటవారు, మిత్రులు, శత్రువులు, ఆంక్షలు విధించిన వారు, ఆటంకాలు కల్పించిన వారు, మమ్మల్ని టెర్రరిస్టులుగా చిత్రించేందుకు ప్రయత్నించే వారికి నేను చెప్పే చివరి మాట ఇదే. యావత్ ప్రపంచం తలకిందులైనా మేము మా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కశ్మీర్ మిషన్ నుంచి మడం తిప్పం' అని సైఫుల్లా హెచ్చరికలు చేశాడు. కశ్మీర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, జునాగఢ్, హెదరాబాద్ డక్కన్, బెంగాల్, పాకిస్తాన్‌లో కొన్ని ప్రాంతాలు ఇస్లామాద్ నుంచి స్వాధీనం చేసుకున్న వివాదాస్పద ప్రాంతాలని పేర్కొన్నాడు.
ఇటీవల పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఒక ర్యాలీలోనూ కసూరి మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారినంటూ వేసిన నిందలే తనను పాపులర్ చేశాయని, ఇప్పుడు తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోందని అన్నాడు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఊచకోత కోశారు. ఇందుకు ప్రతిగా భారత్ మే 7 నుంచి 10వ తేదీ వరకూ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. తొమ్మిదికి పైగా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి, 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఇవి కూడా చదవండి..
2026కు ఘనంగా స్వాగతం.. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్..
ఎవరూ మధ్యవర్తిత్వం వహించలేదు: చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ