Share News

Ways to Get US CitizenShip : బర్త్‌రైట్ లేకున్నా.. ఈ మార్గాల్లో అమెరికా పౌరసత్వం పొందవచ్చు..

ABN , Publish Date - Jan 23 , 2025 | 05:23 PM

వలసలు నిరోధించేందుకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు అమెరికా పౌరసత్వం ఎలా పొందాలనే ఆందోళన భారతీయుల్లో మొదలైంది. అయినా, అమెరికా పౌరసత్వ కల నెరవేర్చుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి..

Ways to Get US CitizenShip : బర్త్‌రైట్ లేకున్నా.. ఈ మార్గాల్లో అమెరికా పౌరసత్వం పొందవచ్చు..
Ways to Get US CitizenShip Despite Changes to Birthright Citizenship

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్టుగా వలసలు కట్టడికి కీలక సంతకం చేశారు ట్రంప్. వలస చట్టాలను కఠినతరం చేయడంలో భాగంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం ఇక నుంచి ఈజీ కాదని చాటి చెప్పేలా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన దేశాలతో పోల్చితే ఈ నిర్ణయం ప్రభావం భారతీయులపైనే ఎక్కువ పడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అమెరికా గడ్డపై పుట్టిన ఎవరికైనా ఆ దేశ పౌరసత్వం వచ్చేది. ఇక నుంచి ఆ వెసులుబాటు లేకపోవడంతో గ్రీన్‌కార్డు, తాత్కాలిక వీసాలపై యూఎస్‌లో పనిచేస్తున్న వారిలో కలవరం మొదలైంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని కోరుకునేవారికి ఇది చాలా పెద్ద షాక్. అయితే, అమెరికా పౌరసత్వం పొందేందుకు వేరే మార్గాలూ లేకపోలేదు.


అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య ఏటికేడు వేగంగా పెరుగుతోంది. చదువు, ఉద్యోగరీత్యా తాత్కాలిక వీసాపై యూఎస్ వెళ్తూ క్రమంగా అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు చాలామంది. అందుకే, కొన్నేళ్లలో అమెరికాకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య చైనా దేశాన్ని మించిపోతుందని అంచనా. ఇలాంటి సమయంలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా కల కనేవారిలో ఆందోళన పెంచింది. పిల్లలకు యూఎస్ పౌరసత్వం కోసం ‘బర్త్‌ టూరిజం’ పేరిట డెలివరీ ముందు అమెరికా వెళుతుంటారు చాలామంది. ఇక నుంచి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, అమెరికాలో తండ్రి చట్టబద్ధంగా నివసిస్తున్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా లేదా తండ్రి శాశ్వత నివాసి అయ్యి.. తల్లి తాత్కాలిక వీసాపై పనిచేస్తున్నా వారి బిడ్డలకు అమెరికా పౌరసత్వం రాదు.


బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చట్టం రద్దు అయినప్పటికీ, ఈ కింది మార్గాల్లో అమెరికా పౌరులు కావచ్చు..

1. న్యాచురలైజేషన్ : ఎవరైనా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండి కనీసం 5 సంవత్సరాలు శాశ్వత నివాసిగా ఉండటంతో పాటు అవసరమైన అన్ని అర్హతలు ఉంటే న్యాచురలైజేషన్ రూల్ ప్రకారం అమెరికా పౌరులు కావచ్చు.

2. యూఎస్ సిటిజన్‌తో వివాహం : అమెరికా పౌరసత్వం ఉన్నవారిని పెళ్లి చేసుకుని మూడేళ్ల పాటు అక్కడే నివాసం ఉన్నా శాశ్వత పౌరసత్వం లభిస్తుంది.

3. గ్రీన్‌కార్డుపై ఉంటూ అద్భుత ప్రతిభ ఉంటే : గ్రీన్‌కార్డుపై అమెరికాకు వెళ్లి సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి యూఎస్ రెడ్ కార్పెట్ వేసి మరీ పౌరసత్వం ఇస్తుంది.

4. ఆశ్రయం కోరడం : యుద్ధం, హింస లేదా భరించలేని పరిస్థితుల కారణంగా ఎవరైనా తన స్వదేశం సురక్షితం కాదని భావిస్తే వారు అమెరికాలో ఆశ్రయం పొందేందుకు అర్హత పొందవచ్చు. అక్కడ స్థిరపడిన తర్వాత శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


జన్మహక్కు పౌరసత్వంలో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను మాత్రమే కాకుండా భారతదేశం నుంచి విద్యార్థులు, వృత్తినిపుణులను దేశంలోకి రాకుండా నిలువరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న చర్యను నిలువరించాలని 22 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ దావా వేసారు. శతాబ్దాల నాటి ఇమ్మిగ్రేషన్ పద్ధతి ప్రకారం, అమెరికాలో జన్మించిన పిల్లలు వారి తల్లిదండ్రుల హోదాతో సంబంధం లేకుండా పౌరసత్వం పొందటం న్యాయమని పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2025 | 05:36 PM