Hamas spokesperson killed: హమాస్ సాయుధ విభాగం ప్రతినిధిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ మిలటరీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:01 PM
హమాస్‌కు చెందిన టాప్ మిలటరీ నేతలతో ఉబైదా సన్నిహితంగా ఉండేవాడు. రెండు దశాబ్దాలుగా గ్రూప్ సందేశాలను తరచు వీడియోల ద్వారా చేరవేసేవాడు.
జెరూసలేం: హమాస్ (Hamas)కు మరో గట్టిదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఉబైదా (Abu Ubaida)ను ఇజ్రాయెల్ మిలటరీ గాజాలో మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్చ్ ఆదివారంనాడు తెలిపారు. మిలటరీ, షిన్ బెట్ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా జరిగిన ఆపరేషన్‌లో ఉబైదాను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా కథనం వెలువరించింది.
దీనికి ముందు నెతన్యాహు ఆదివారం ఉదయం మాట్లాడుతూ, ఉబైదాను ఇజ్రాయెల్ మిలట్రీ శుక్రవారంనాడు టార్గెట్ చేసిందని చెప్పారు. అయితే దాడుల ఫలితం ఇంకా తెలియలేదని చెప్పారు. కాగా, పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు ఉబైదా చిరపరిచితుడే. హమాస్‌కు చెందిన టాప్ మిలటరీ నేతలతో ఉబైదా సన్నిహితంగా ఉండేవాడు. రెండు దశాబ్దాలుగా గ్రూప్ సందేశాలను తరచు వీడియోల ద్వారా చేరవేసేవాడు.
కాగా, గాజా సిటీపై ఇజ్రాయెల్ మిలటరీ గగనతల, భూతల దాడులతో ఆదివారంనాడు పెద్దఎత్తున విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలు ఇళ్లు ధ్వంసం కాగా, పలు కుటుంబాలు ఆ ప్రాంత్రాన్ని విడిచిపెట్టాయి. సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా సిటీని దిగ్బంధం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నెతన్యాహు ఆదివారంనాడు భద్రతా క్యాబినెట్‌తో సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి..
చైనా అధ్యక్షుడితో సమావేశం.. పరస్పర గౌరవమే ఇరు దేశాల బంధానికి మూలమన్న మోదీ
భారత పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి