Modi-Xi Meet: చైనా అధ్యక్షుడితో సమావేశం.. పరస్పర గౌరవమే ఇరు దేశాల బంధానికి మూలమన్న మోదీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:56 AM
పరస్పర విశ్వాసయం, గౌరవం, సహృదయతే భారత్ చైనా బంధంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు జెన్‌పింగ్‌తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. తనను చైనా పర్యటనకు ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సహృదయతే భారత్, చైనా సంబంధాలకు మూలం అని మోదీ ఈ సందర్భంగా అన్నారు. దౌత్యబంధాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
సరిహద్దు పరిస్థితుల నిర్వహణకు సంబంధించి భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య అవగాహన కుదిరిన విషయాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కైలాశ్ మాన్సరోవర్ యాత్ర ప్రారంభమైన వైనం, చైనా, భారత్ మధ్య నేరుగా ఫ్లైట్స్ మొదలు కానున్న విషయాన్ని ప్రస్తావించారు. భారత్, చైనా దేశాల్లోని 2.8 బిలియన్ ప్రజల సంక్షేమం ఇరు దేశాల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కజాన్ (రష్యా) వేదికగా గతేడాది తమ మధ్య జరిగిన చర్చలు ఇరు దేశాల దౌత్య బంధాన్ని మేలిమలుపు తిప్పాయని అన్నారు. సరిహద్దు వెంబడి దళాల ఉపసంహరణ, శాంతియుత వాతావరణం నెలకొందని అన్నారు.
ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉండటం అవసరమని అన్నారు. డ్రాగన్, ఏనుగు కలిసి నడవాలని వ్యాఖ్యానించారు. మంచి ఇరుగుపొరుగుగా ఉండాలని కూడా అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచం వేగంగా మారుతోంది. భారత్, చైనా రెండూ ప్రాచీన సంస్కృతులకు ఆలవాలం. గ్లోబల్ సౌత్‌లో భాగం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఇరు దేశాల్లో ఉంది. కాబట్టి రెండు దేశాలు మిత్రులుగా ఉండాల్సిన అసవరం ఉంది’ అని జిన్‌పింగ్ అన్నారు. భారత్ చైనా దౌత్య బంధానికి ఇది 75వ వార్షికోత్సవమని కూడా జిన్‌పింగ్ ప్రస్తావించారు. బహుళ ధ్రువ ప్రపంచం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఇరు దేశాలపై ఉందని అన్నారు. ఆసియాతో పాటు ప్రపంచంలో శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
దాదాపు ఏడేళ్ల తరువాత ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2018లో వూహాన్‌లో పర్యటించిన తరువాత భారత్ చైనా మధ్య డోక్లామ్ వేదికగా ప్రతిష్టంభన నెలకొంది. ఈసారి మాత్రం ఇరు దేశాలు వ్యూహాత్మక, ఆర్థిక సహకారంపై దృష్టి పెట్టాయి. ఇక ప్రధాని మోదీ కాసేపట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై మీరూ ఆంక్షలు విధించండి.. ఐరోపా దేశాలకు అమెరికా సూచన
అమెరికాకు అన్ని పోస్టల్ పార్శిళ్లు బంద్.. భారత్ నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి