Postal Services Halted: అమెరికాకు అన్ని పోస్టల్ పార్శిళ్లు బంద్
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:10 AM
సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు వెళ్లే అన్ని రకాల మెయిల్ బుకింగ్స్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోస్టల్ విభాగం, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ...
కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 30: సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు వెళ్లే అన్ని రకాల మెయిల్ బుకింగ్స్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోస్టల్ విభాగం, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటీసు జారీచేశాయి. అమెరికా దిగుమతి సుంకాలపై గందరగోళం నేపథ్యంలో లెటర్లు, డాక్యుమెంట్లు, 100 డాలర్ల కంటే తక్కువ విలువైన బహుమతులు సహా అన్ని క్యాటగిరీల మెయిల్ బుకింగ్స్‌ను పూర్తిస్థాయిలో ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. నియంత్రణ విధానాల్లో అస్పష్టత, అమెరికాకు పార్సిళ్లను రవాణా చేసేందుకు విమానయాన సంస్థల విముఖత అంశాలను కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, వీలైనంత త్వరగా అన్ని రకాల సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోస్టల్ విభాగం వెల్లడించింది. అమెరికా కస్టమ్స్ విభాగం జారీచేసిన కొత్త నిబంధనల్లో స్పష్టత లేని కారణంగా పార్సిళ్లను తీసుకెళ్లేందుకు విమానయాన సంస్థలు నిరాకరిస్తున్నాయని ప్రభుత్వం ఈనెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. జూలై 30న అమెరికా ప్రభుత్వం జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం.. ఆగస్టు 29 నుంచి 100 డాలర్లకు పైగా విలువైన పార్సిళ్లపై కస్టమ్స్ సుంకాలు వర్తించనున్నాయి. ఈ నేపథ్యంలో లెటర్లు, డాక్యుమెంట్లు, 100 డాలర్ల వరకు విలువైన బహుమతుల పార్సిళ్ల రవాణాకు అనుమతిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఇంతకుముందటి ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఇప్పుడు అమెరికాకు అన్ని మెయిల్ సర్వీసులను నిలిపివేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు పార్సిళ్ల దిగుమతులపై పెంచిన సుంకాలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.