Pak Massive Protes: పీఓకేలో ఆగని ఆందోళనలు.. పాక్ బలగాల కాల్పుల్లో 8 మంది పౌరులు మృతి
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:40 PM
పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JACC) ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి.
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) అట్టుడుకుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు మూడోరోజూ కొనసాగుతున్నాయి. బుధవారం నాటి నిరసనల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాగ్ జిల్లా ధీరకోట్‌లో నలుగురు, ముజఫకాబాద్, మీర్‌పూర్‌లో ఇద్దరు చొప్పున పాక్ బలగాల కాల్పుల్లో మృతి చెందారు. మంగళవారం నాడు ముజఫరాబాద్‌లో మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య పదికి చేరింది.
పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JACC) ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. దీంతో మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి. రవాణా సర్వీసులు నిలిచిపోయాయి. బుధవారం ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ.. ముజఫరాబాద్‌కు వెళ్లకుండా వంతెనపై అడ్డంగా నిలిపి ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను దిగువన ఉన్న నదిలోకి దొర్లించేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు.
ముజఫరాబాద్‌లో నిరసనకారులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని, భద్రతా బలగాలు షెల్లింగ్స్‌తో విరుచుపడ్డాయని, దీంతో పలువురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని జేఏసీసీ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్ధులకు పీఓకే అసెంబ్లీలో 12 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేయడాన్ని రద్దు చేయడంతో సహా 38 డిమాండ్లపై ముజఫరాబాద్ 'లాంగ్ మార్చ్'కు జేఏసీసీ పిలుపునిచ్చింది. గత 70 ఏళ్లుగా తాము ప్రాథమిక హక్కులకూ నోచుకోవడం లేదని, తమ డిమాండ్లు నెరవేర్చకుంటే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని జేఏసీసీ నేత సౌకత్ నవాజ్ మీర్ తెలిపారు. 'ప్లాన్ A'లో భాగంగా చేపట్టిన సమ్మెతో ప్రజలు సహనం కోల్పోతే ఏమవుతుందో చూపించామని, ఉధృతమైన 'ప్లాన్ డి'తో సహా పలు ప్లాన్స్ తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
కాగా, పీఓకేలోని నిరసనలను బలప్రదర్శనతో అణచివేసేందుకు ఇస్లామాబాద్ భారీగా బలగాలను దింపుతోంది. పీఓకే పట్టణాల్లో భారీగా సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నాయి. 1,000 అదనపు ట్రూప్‌లను రాజధాని ఇస్లామాబాద్‌లో మోహరించింది. గత వారంలో ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని ఒక గ్రామంపై పాక్ బాంబులతో విరుచుకుపడింది. చైనా తయారు చేసిన ఎల్-6 లేజర్ గైడెడ్ బాంబులను చైనా మేడ్ జే-17 ఫైటర్ జెట్ల నుంచి పెద్దఎత్తున జారవిడచడంతో 30మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పీఓకేలో పెద్దఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికా షట్‌డౌన్.. ట్రంప్ అధ్యక్షతన రెండోసారి..
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 31మంది మృతి..
For More International News and Telugu News..