Golden Dome: అమెరికాపై మిస్సైల్ దాడులకు చెక్..ట్రంప్ గోల్డెన్ డోమ్ షీల్డ్ ప్రకటన
ABN , Publish Date - May 21 , 2025 | 10:08 AM
ప్రపంచ రాజకీయాల్లో తన నిర్ణయాలతో సంచలనం సృష్టించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపేలా, ఆయన గోల్డెన్ డోమ్ (Golden Dome) మిస్సైల్ షీల్డ్ అనే కొత్త రక్షణ వ్యవస్థను ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే గోల్డెన్ డోమ్ (Golden Dome) మిస్సైల్ షీల్డ్ వ్యవస్థను ప్రకటించారు. ఈ వ్యవస్థ అమెరికాను దాడుల నుంచి రక్షించడానికి రూపొందించబడింది. ట్రంప్ ఈ వ్యవస్థను మూడు సంవత్సరాలలో అమలులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దీని కోసం మొదటి దశలో 25 బిలియన్ డాలర్ల నిధులతోపాటు, మొత్తం 175 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో అమెరికా ప్రజలకు కట్టుదిట్టమైన మిస్సైల్ రక్షణ వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చినట్లు ట్రంప్ వైట్ హౌస్‌లో గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం..
గోల్డెన్ డోమ్ నిర్మితమైన తర్వాత, ఇది ప్రపంచంలోని ఇతర వైపుల నుంచి లేదా అంతరిక్షం నుంచి ప్రయోగించిన మిస్సైల్స్‌ను కూడా అడ్డుకోవడానికి సామర్థ్యం కలిగి ఉంటుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇది మన దేశం విజయానికి, జీవనానికి చాలా ముఖ్యమైనదన్నారు. ఈ ప్రాజెక్టుకు అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గ్యుట్లెయిన్ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. కెనడా కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఆసక్తి చూపించింది. ట్రంప్ మొత్తం ఖర్చును 175 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నప్పటికీ, అమెరికన్ కాంగ్రెస్ 20 సంవత్సరాలలో పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ఎదుర్కొనేందుకు ఖర్చు 161 బిలియన్ డాలర్ల నుంచి 542 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది.
ఇజ్రాయెల్ మాదిరిగా..
ఈ వ్యవస్థ క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్సోనిక్ మిస్సైల్స్, డ్రోన్ల నుంచి దేశాన్ని రక్షించడానికి ఉద్దేశించబడిందని పెంటాగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్ అన్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా.. ట్రంప్ ప్రణాళికలను వ్యతిరేకిస్తున్నాయి. గోల్డెన్ డోమ్ ప్రణాళిక పేరు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నుంచి వచ్చింది. ఇది 2011లో ప్రారంభమైన తర్వాత వేలాది చిన్న రేంజ్ రాకెట్లను, ఇతర దాడులను అడ్డుకుంది. గత కొన్నేళ్లుగా అమెరికా వివిధ మిస్సైల్ ముప్పులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే 2022లో అమెరికా మిస్సైల్ డిఫెన్స్ సమీక్షలో రష్యా, చైనాతో పెరుగుతున్న ముప్పుల గురించి సూచించింది. దీంతోపాటు ఉత్తర కొరియా, ఇరాన్ నుంచి కూడా ముప్పును పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
Indian Techie Killed: భారత సంతతికి చెందిన టెక్కీ హత్య..అసలేమైంది, ఎందుకు జరిగిందంటే
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి