10-3-2-1 సుఖనిద్రకు ఫార్ములా...
ABN , Publish Date - May 11 , 2025 | 01:09 PM
అలసిన శరీరం సేదతీరాలంటే... కంటినిండా నిద్రకు మించిన మార్గం లేదు. నిద్ర సరిగా లేదంటే... తలనొప్పి, ఊబకాయం, మధు మేహం, మానసిక ఒత్తిడి వంటి అనేక సమస్యలు చుట్టుముడతాయి. నిద్రలేమికి చెక్ పెట్టాలంటే 10-3-2-1 ఫార్ములాని పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. నిద్రకు మంత్రంలా పనిచేసే ఈ నయా సూత్రం ఏమిటంటే...
10 గంటల ముందు...
కెఫిన్ ఉత్పత్తులు సేవించాలనుకుంటే గనుక.. నిద్రపోవడానికి 10 గంటల ముందే తీసుకోవాలి. తర్వాత వాటి జోలికెళ్లకూడదు. ఎందుకంటే అవి మెదడును విశ్రాంతి దశలోకి వెళ్లనివ్వవు. పైగా చురుగ్గా ఉంచుతాయి. దాంతో ఎంత గింజుకున్నా నిద్ర రాదు. అందుకే ఉదయం పూట మాత్రమే కెఫిన్ ఉండే టీ, కాఫీ వంటివి తీసుకోవాలి.
3 గంటల ముందు...
రాత్రిపూట ఆలస్యంగా కడుపునిండా భోజనం చేయటం, జీర్ణం కాని పదార్థాలు తినటం వల్ల... గుండె వేగం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. కాబట్టి నిద్ర పోవడానికి మూడు గంటల ముందే భోజనం ముగించేయాలి. కొవ్వు పదార్థాలకు బదులు తేలికగా జీర్ణమయ్యేవి తినాలి.
2 గంటల ముందు...
కొందరు రాత్రుళ్లు మేల్కొని పనులు చక్కబెడుతుంటారు. పెండింగ్ వర్క్ అంతా పూర్తి చేసి పడుకోవాలని భావిస్తుంటారు. అయితే క్రమక్రమంగా ఈ అలవాటు నిద్ర లేమికి దారితీస్తుంది. అందుకే రాత్రివేళ నిద్రకు ఆటంకం కలిగేలా పనులు పెట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ ఏదైనా పని ఉంటే గనుక నిద్రకు 2 గంటల ముందే పూర్తి చేసుకోవాలి.
1 గంట ముందు...
నిద్రపోవడానికి ఒక గంట ముందే ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలకా్ట్రనిక్ గ్యాడ్జెట్లన్నింటినీ ఆఫ్ చేయాలి. పడకగదిలో ఇలాంటి పరికరాలేవీ లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కంటిపై నీలికాంతి (బ్లూ లైట్) ప్రభావం లేకుండా హాయిగా నిద్ర పడుతుంది.
నిద్రలేమితో ఆరోగ్య సమస్యలివి...
ఏదో రెండు మూడు రోజులు నిద్ర పట్టడం లేదంటే లైట్ తీసుకోవచ్చు కానీ... నిద్రలేమి సమస్యగా మారితే మాత్రం తప్పకుండా లైఫ్‌స్టయిల్ మార్చుకోవాల్సిందే. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి.
మధుమేహం: నిద్రలేమితో ఇన్సులిన్ నిరోధకత తలెత్తుతుంది. అంటే కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించవు. దీంతో కణాల్లోకి గ్లూకోజు చేరుకోదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి.

అధిక రక్తపోటు: మామూలుగా నిద్రపోతున్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది. నిద్రలేమితో దీర్ఘకాలం రక్తపోటు అధికంగా ఉంటుంది. దీని మూలంగా గుండె సంబంధిత జబ్బులు పెరుగుతాయి.
ఊబకాయం: నిద్ర సరిగా పట్టకపోతే మెదడులో ఆకలిని నియంత్రించే హార్మోన్ల తీరు అస్తవ్యస్తమవుతుంది. అందువల్ల తెలియ కుండానే అధికంగా తింటారు. నిద్ర సరిగా పట్టకపోతే ఉదయం వ్యాయామం చేయాలనే ఆసక్తి తగ్గుతుంది. దాంతో బరువు పెరగటానికి, ఊబకాయానికి దారితీస్తాయి.
సుఖనిద్ర కోసం...
నిద్ర సరిగా పట్టాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాల్సిందే. అవేమిటంటే...
- నిద్రపోయే గదిలో మసక చీకటి ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ఉపక్రమించటానికి ముందు నుంచే ఇంట్లో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది.
- బెడ్ సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
- రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చాలా ముఖ్యం. దీంతో నిద్రవేళలు ఒక క్రమంలోకి వస్తాయి. ఎప్పుడైనా రాత్రి కాస్త ఆలస్యంగా పడుకున్నా కూడా ఉదయం అదే సమయానికి లేవడం నేర్చుకోవాలి.
- పగటిపూట ఏదో కాసేపు కునుకు తీస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువసేపు నిద్రిస్తే, రాత్రి నిద్ర అవసరం తగ్గుతుంది. కాబట్టి పగటి నిద్ర అరగంటకు మించరాదు.
- రాత్రిపూట వ్యాయామం మానుకోవాలి. పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల అడ్రినలిన్ స్థాయి, శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తద్వారా నిద్ర పోవడం కష్టమవుతుంది. బదులుగా చిన్నచిన్న స్ట్రెచెస్, యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించొచ్చు.
- సాయంత్రం పూట గోరువెచ్చని నీటితో స్నానం చేసి, కాసేపు శ్రావ్యమైన సంగీతం వింటే హాయిగా నిద్ర పడుతుంది.
- నిద్ర పట్టనప్పుడు.. లేచి కుర్చీలో కూర్చొని కాసేపు ఏదైనా మంచి పుస్తకం చదవుకోవాలి. నిద్ర వస్తున్నప్పుడే బెడ్ మీదికి వెళ్లాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
Read Latest Telangana News and National News