Health: పాతికేళ్లకే వణుకుడు.. పొంచి ఉన్న ‘పార్కిన్సన్స్’
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:26 AM
ఆ యువకుడి వయస్సు 30 ఏళ్లు. ఆఫీసులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కంప్యూటర్ వర్క్స్ చేస్తున్న అతనికి చేతులు వణకుతున్నాయి. ఒక పదానికి బదులు మరో పదం టైప్ అయ్యేది. ప్రాజెక్ట్ వర్క్ చేయడంలో ఇబ్బంది పడేవాడు. నీళ్లు, టీ తాగుతున్నప్పుడూ చేతులు వణికేవి. అవి కింద ఒలికిపోయేవి. తలను సైతం సరిగా దువ్వుకోలేక పోయేవాడు. ఆందోళనతో అతను డాక్టర్‌ను కలిశాడు. పరీక్షించి ఆ యువకుడు పార్కిన్సన్స్ జబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతనికి వైద్య చికిత్స మొదలు పెట్టారు.

- తడబడుతున్న మాటలు.. వణుకుతున్న చేతులు
- చిన్న చిన్న పనులు చేసుకోలేక సతమతం
- పసిగట్టలేక అవస్థలు
- నేడు వరల్డ్ పార్కిన్సన్స్ డే
హైదరాబాద్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ వ్యాధి(Parkinson disease) రెండవ అత్యంత న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్. సాధారణ భాషలో వణుకుడు వ్యాధి (షేకింగ్ డిసీజ్)గా చెబుతారు. మెదడులో నాడీ కణాలు దెబ్బదినటం, క్షీణించటం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. భారతదేశంలో వివిధ అధ్యయనాల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు 15 నుంచి 43 మందిలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి ప్రాబల్యం ఉన్నట్టుగా చెబుతున్నారు. పెరుగుతున్న ఆయుర్దాయం, వృద్ధాప్య జనాభాతో మన దేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందని న్యూరో వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వణుకుడు వ్యాధిని ముందుగా డాక్టర్. జేమ్స్ పార్కిన్సన్ గుర్తించారు. దీంతో ఈ వ్యాధికి ఆయన పేరున పార్కిన్సన్స్ వ్యాధిగా నామకరణం చేసి, ఆయన జన్మదినమైన ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్స్ డేగా జరుపుకుంటున్నారు. సాధారణంగా వృద్ధులలో కనిపించే ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు పాతికేళ్ల వయస్సులో ఉన్న వారిలోనూ కనిపిస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Admissions: అడ్మిషన్లలో కార్పొ‘రేట్’ దందా..
20 వేల మందికి చికిత్స
నిమ్స్‌లో ప్రత్యేకమైన న్యూరాలజీ పార్కిన్సన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 20 వేల మందికి చికిత్సలు అందించినట్లు వైద్యులు తెలిపారు. ఓపీ విభాగానికి రోజూ అయిదు నుంచి పది మంది వణుకుడు సమస్యలతో వస్తున్నట్లు వైద్యులు వివరించారు.
ఈ లక్షణాలు కనిపిస్తే..
పార్కిన్సన్ వ్యాధి ప్రధానంగా మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే న్యూరాన్‌లను కోల్పోవడం, ఇతర న్యూరోట్రాన్సిమీటర్ ఉత్పత్తి చేసే న్యూరాన్‌లను కోల్పోవడం వల్ల వస్తుంది. విశ్రాంతి సమయంలో వణుకు, అన్ని కార్యకలాపాలలో మందగమనం, దృఢత్వం కోల్పోవడం, నడక కష్టం, ప్రసంగం, చేతిరాత మార్పులు, మలబద్ధకం, వాసన కోల్పోవడం, మూత్ర విసర్జనలో ఆటంకాలు, బీపీ హెచ్చుతగ్గులు, జ్ఞాపకశక్తికి ఆటంకాలు వంటివి వ్యాధి లక్షణాలు.
కుటుంబంలో ఒకరికి వస్తే..
పార్కిన్సన్స్ జబ్బు ఒక రకమైన న్యూరో డీజనరేటివ్ డిసీజ్. కుటుంబంలో ఎవరికైనా ఉంటే పదిహేను శాతం వచ్చే అవకాశముంది. చిన్న వయస్సులోనే ఈ జబ్బు వస్తే వారి పిల్లలకు కూడా వచ్చే ముప్పు ఉంది. ఈ జబ్బు వచ్చిన వారిలో మెదడులో సబ్ స్పాన్షియా నైగా అనే భాగం దెబ్బతినడం వల్ల న్యూరోట్రాన్స్‌మీటర్ స్థాయి క్రమంగా క్షీణిస్తుంది. క్లినికల్ పరీక్షలు చేసి ఈ జబ్బును నిర్ధారించాల్సి ఉంటుంది. కొంతమంది బాధితులకు ఎంఆర్‌ఐ, పెట్ స్కాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
నియంత్రణ ఇలా..
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) అనేది పార్కిన్సన్స్ వ్యాధికి ఒక అత్యాధునిక శస్త్రచికిత్స. డీబీఎస్ అంటే మెదడులో ఒక చిన్న పరికరం (పల్స్ జనరేటర్)ను అమర్చడం, ఇది కదలికను నియంత్రించే మెదడులోని నిర్దిష్ట ప్రాంతాలకు విద్యుత్ ప్రేరణలను పంపుతుంది. ఈ ప్రేరణలు పార్కిన్సన్స్ వ్యాధి వల్ల కలిగే అసాధారణ మెదడు కార్యకలాపాలను నియంత్రించడంలో సహాయపడతాయి. రోగులు చలనశీలత, స్వేచ్చను తిరిగి పొందేందుకు వీలు కల్పిస్తుంది. దీర్ఘకాలిక ఔషధ వినియోగంతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. డీబీఎస్, పార్కిన్సన్స్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. - డాక్టర్ రూపమ్ బోర్గోహైన్,
సీనియర్ న్యూరాలజిస్టు, యశోద ఆస్పత్రి
మార్పు గుర్తిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి
అధిక బరువు, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్, తలపై గాయాలు, మెలనోమా, ప్రొస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్‌తో బాధపడే వారిలో కూడా పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ముప్పు ఉంటుంది. ఇలాంటి వారు అప్రమత్తంగా ఉండాలి. వైద్యులను సంప్రందించి అవసరమైన చికిత్సలు తీసుకోవాలి. ఏ వయస్సు వారైనా వణుకుడు, మాట తీరులో మార్పులు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలిసి అవసరమైన చికిత్సలు తీసుకోవాలి. లక్షణాల ఆధారంగా చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.
-డాక్టర్ ఎం.జయశ్రీ, న్యూరాలజిస్టు, కిమ్స్
ఈ వార్తలు కూడా చదవండి:
గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Read Latest Telangana News and National News