Covid: ఒకవైపు కొవిడ్.. మరోవైపు జబ్బులు
ABN , Publish Date - May 27 , 2025 | 07:48 AM
ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమైంది. అయితే.. ప్రతిఏటా వర్షాకాలంలో ఆయా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దీనికితోడు కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది.
- వైద్య, ఆరోగ్యశాఖకు సవాల్
హైదరాబాద్ సిటీ: వర్షాల సీజన్ మొదలైంది. ఈసారి వర్షాకాలం వైద్య, ఆరోగ్యశాఖకు సవాల్‌గానే మారుతోంది. వర్షాకాలంలో వ్యాధులు చుట్టుముడుతాయి. సరిగ్గా ఇదే సమయంలో మరోవైపు కొవిడ్ భయపెడుతోంది. ప్రస్తుతం కొవిడ్ సీరియస్‌గా లేకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పకడ్బందీ ప్లాన్‌తో వెళితే..
వైద్య ఆరోగ్య శాఖకు ప్రస్తుత వర్షాకాలం సవాల్‌గా మారుతోంది. పకడ్బందీ ప్లాన్‌తోను ముందుకు వెళితేనే వ్యాధులను నియంత్రణలో పెట్టే అవకాశముంది. కొవిడ్‌పై ప్రజలను అప్రమత్తం చేయడం, బాధితులు, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేస్తూ వ్యాప్తిని నియంత్రించాల్సి ఉంటుంది. అలాగే యూపీహెచ్‌సీల్లో రాపిడ్, ఆర్‌టీపీసీఆర్ వంటి పరీక్షలు వెంటనే చేయడం వల్ల కొవిడ్‌ను ముందుగానే గుర్తించి, వ్యాప్తిని అరికట్టే అవకాశముంటుంది.

మరోవైపు మాన్‌సూన్ నేపథ్యంలో జూన్ మొదటి వారంలో క్యాంపులు నిర్వహించడం, పరీక్షలు చేయడం, ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే శ్వాసకోశ జబ్బులు, దగ్గు, జలుబుతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించేలా దృష్టి సారించాల్సి ఉంది.
ఇలా చేయాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 85 యూపీహెచ్‌సీలున్నాయి. గత ఏడాదిలో జబ్బులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలెన్ని, ఏ వయస్సు వారు చికిత్సలు పొందారు వంటి వివరాలు యూపీహెచ్‌సీల నుంచి సేకరించి దాని ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రస్తుతం వైరల్ ఫీవర్లు అధికంగా వచ్చే యూపీహెచ్‌సీల నుంచి వివరాలు సేకరించాలి. వాటి పరిధిలో కేసులు ఎక్కువగా వస్తున్నాయో.. లేదో పరిశీలించాలి. ఒకే ఏరియాలో ఎక్కువ మంది జబ్బులతో వస్తే ఎందుకు వస్తున్నారో గుర్తించాలి. ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఓఆర్‌ఎస్, ఇతర మందులను పంపిణీ చేయాలి. అలాగే కోవిడ్‌పై ప్రజలకు అవగామన కల్పించాలి.
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News