Health: ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నీ నిండా రాళ్లు...
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:44 AM
పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.
- ఒకే సిట్టింగ్‌లో తొలగించిన వైద్యులు
హైదరాబాద్: వరంగల్(Warangal) జిల్లాకు చెందిన ఎనిమిది సంవత్సరాల బాలుడికి ఎడమవైపు మూత్రపిండం నిండా రాళ్లు ఏర్పడడంతో వాటిని ఒకే సిట్టింగ్‌లో తొలగించామని బంజారాహిల్స్(Banjara Hills)లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.అశ్విన్ శేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల చిన్న పిల్లలు, నవజాత శిశువుల్లో కూడా కిడ్నీలో రాళ్ల సమస్య కనిపిస్తోందని పేర్కొన్నారు.
తగినంత నీళ్లు తాగకపోవడం, అల్ర్టా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవడం లాంటివి ఇందుకు కారణాలవుతున్నాయని తెలిపారు. మరీ చిన్నపిల్లల్లో మెటబాలిక్, ఊబకాయం, పర్యావరణ కారణాల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఆ బాలుడికి విపరీతమైన కడుపునొప్పి, జ్వరం ఉండడంతో అది కిడ్నీలో రాళ్ల సమస్యేనని గుర్తించి పెర్‌క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్‌ఎల్) చేయాలని నిర్ణయించామని,

ఇందులో భాగంగా వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా రాళ్లను తొలగించామని తెలిపారు. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఈ విధానంతో త్వరగా కోలుకుంటారని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులు తెలంగాణలో 6.2ు ఉన్నాయని, గడిచిన 15-20 ఏళ్లలో పిల్లలకు కిడ్నీల్లో రాళ్ల సమస్య నాలుగు రెట్లు అయ్యిందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News